ఎన్నికల తర్వాత కేసీఆర్ పీఎం, కేటీఆర్ సీఎం: హోంమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

11:06 am, Wed, 3 April 19
KCR Latest News, KTR Latest News, Telangana Political News, Newsxpressonline

మహబూబ్‌నగర్‌: తనకు ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదని తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చెబుతుండగా.. హోంమంత్రి మహమూద్ అలీ మాత్రం ఎన్నికల తర్వాత కేసీఆరే ప్రధాని అంటూ వ్యాఖ్యానించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మంగళవారం మహబూబ్‌నగర్‌ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి ఎంపీ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. పార్లమెంటు ఎన్నికల తర్వాత దేశ ప్రధానిగా కేసీఆర్‌.. తెలంగాణ ముఖ్యమంత్రిగా కేటీఆర్‌ ఉండే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. దేశంలో కాంగ్రెస్‌, బీజేపీల పని అయిపోయిందన్నారు.

ప్రాంతీయ పార్టీలే..

చాలా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే ముందంజలో ఉన్నాయని, ఆ పార్టీల అభ్యర్థులే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ మంది గెలవనున్నట్లు సర్వేలు చెబుతున్నాయని వివరించారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కేసీఆర్‌ కీలకమవుతారని చెప్పారు.

కాశ్మీర్‌కు చెందిన ప్రముఖులు తనను కలవడానికి వచ్చిన సందర్భంలో ప్రధానిగా కేసీఆర్‌ ఉంటే సమస్య పరిష్కారం అయ్యేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని వ్యాఖ్యానించారు. ఇది ఇలావుంటే, కేసీఆర్ మాత్రం తనకు ప్రధాని కావాలనే కోరికేమీ లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. తెలంగాణలోని 16 స్థానాల్లో గెలిస్తే కేంద్రంలో కీలక పాత్ర పోషించవచ్చని, రాష్ట్రానికి రావాల్సిన నిధులను, ప్రాజెక్టులను రాబట్టుకోవచ్చని అన్నారు.