జగన్ ప్రభుత్వ దసరా కానుక ఇదే కాబోలు: జనసేన చీఫ్ పవన్ పంచ్‌లు

11:03 am, Tue, 1 October 19

అమరావతి: నవరత్నాలతో అభివృద్ధి చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్‌.. రాష్ట్రాన్ని అంధకారమయం చేసిందంటూ ఫైర్ అయ్యారు జనసేనానీ పవన్ కల్యాణ్. వరుస ట్వీట్లతో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

డిమాండ్‌ మేరకు విద్యుత్‌ ఉత్పత్తికి అవసరమైన ఏర్పాట్లు చేసుకోవడంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందని పవన్ సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం ట్వీట్‌ చేశారు. గత ఏడాది ఇదే నెలలో 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినప్పుడు అందుకు తగ్గ విధంగా సరఫరా చేయగలిగిన ఎనర్జీ డిపార్ట్‌మెంట్.. ఈసారి ఎందుకు విఫలమైందని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.

తక్కువ డిమాండ్ ఉన్నా…

సర్కార్ సన్నద్ధత లేకుండా మీనమేషాలు లెక్కించడంతో గత ఏడాది కంటే తక్కువ డిమాండ్ ఉన్నా ప్రజలు చీకట్ల పాలయ్యారని ట్విట్టర్ వేదికగా విమర్శించారు. ఏ కొత్త ప్రభుత్వమైనా శుభంతో పనులు ప్రారంభిస్తారని, కానీ వైసీపీ సర్కార్ మాత్రం అందుకు విరుద్ధమైన పనులు చేస్తోందని ఆక్షేపించారు.

ఇళ్ల కూల్చివేతలు, పెట్టుబడుల ఒప్పందాలను రద్దు, ఆశా వర్కర్లను రోడ్ల మీదకు తీసుకరావడం, కేసులు పెట్టడం, అమరావతి రాజధాని చెయ్యడం వంటి కార్యక్రమాలతో రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు పవన్.