పవన్ కళ్యాణ్‌పై మాయావతి ప్రశంసల వర్షం: జనసేనాని పాదాభివందనం

8:37 pm, Thu, 4 April 19
mayawati-pawan kalyan

తిరుపతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఏపీకి యువ ముఖ్యమంత్రి అవుతారని బీఎస్పీ అధినేత్రి మాయవతి జోస్యం చెప్పారు. తిరుపతిలో జరిగిన జనసేన-బీఎస్పీ ఎన్నికల యుద్ధభేరిలో ఆమె ప్రసంగించారు. దేశానికి కాపలాదారు అంటూ బీజేపీ చేసిన మోసాలు ప్రజలను అర్థమయ్యాయని అన్నారు.

స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశంలో చాలా ఏళ్లు కాంగ్రెస్, బీజేపీ పాలనే సాగిందన్నారు. సామాజిక న్యాయం అందించడంలో ఆ పార్టీలన్నీ విఫలమయ్యాయి. గతంలో వాగ్దానాలు ఇచ్చి విస్మరించిన పార్టీలను ప్రజలు ఈసారి ప్రశ్నించాలని అన్నారు. బలహీన వర్గాలు సొంత కాళ్లపై నిలబడే అవకాశం లేకుండా కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాయని ఆరోపించారు.

ఉత్తర ప్రదేశ్ లో నాలుగు సార్లు అధికారం చేపట్టిన బీఎస్పీ బడుగు బలహీన వర్గాల పక్షాన నిలిచిందని అన్నారు. పవన్ కళ్యాణ్.. సమాజ శ్రేయస్సు కోరే వ్యక్తి అని మాయావతి ప్రశంసించారు. నిజాయతీపరుడు.. ప్రజలు బాగుండాలని కోరుకునే తత్వం ఆయనదని అన్నారు.

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడితే బడుగు బలహీన వర్గాలకు అండగా
నిలబడుతామని హామీ ఇచ్చారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌ కు ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీలకు కాకుండా బీఎస్పీ-జనసేనను ప్రజలు దీవించాలని కోరారు. ఈ ఎన్నికల్లో బీఎస్పీ- జనసేన వామపక్షాల కూటమి విజయం సాధించడం తథ్యమని తెలిపారు.

మాయవతికి ఏకలవ్య శిశ్యుడ్ని..

తాను మాయావతికి ఏకలవ్య శిశ్యుడ్ని అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఇదే తిరుపతిలో హోదా ఇస్తానని చెప్పి మోడీ మోసం చేశారన్న ఆయన ఆంధ్రులు ఆ మోసాన్ని మర్చిపోరని అన్నారు. దళితుల్ని వాడుకుని వదిలేసే జగన్ మోహన్ రెడ్డికి కూడా బుద్ది చెప్పాలని, త్రిపాఠి వస్తే జగన్ కనీసం ప్రోటోకాల్ కూడా పాటించరని అన్నారు.

తిరుమల నిర్వాసితుల సమస్యలను అన్నిటినీ పరిష్కారం చేస్తా. స్వీమ్స్ ఆసుపత్రిని అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేస్తా. నగరంలో ఉన్న 52 మురికివాడలను అభివృద్ధి చేస్తా. తిరుపతి పవిత్రతను కాపాడటానికి ప్రత్యేక అడ్మినిస్ట్రేషన్‌‌ను ఏర్పాటు చేస్తా.. దాన్ని సీఎం అటాచ్‌మెంట్ తో పనిచేసేలా చేస్తా. హెరిటెజ్ కోసం విజయ డైరీని చంపేశారు.. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభిస్తా’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

చదవండి: టీడీపీ అభ్యర్థి పుట్టా నివాసంలో ఐటీ దాడులు: సీఎం రమేష్ నిరసన, ఉద్రిక్తత