అచ్చెన్నాయుడి ఇష్యూ: కస్టడీకి కోర్టు అనుమతి, అర్థరాత్రి హైడ్రామా! అసలేం జరిగిందంటే…

- Advertisement -

అమరావతి: ఏపీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడి అరెస్టు వ్యవహారంలో బుధవారం అర్థరాత్రి హైడ్రామా నడిచింది. ఈఎస్ఐ మందుల కొనుగోలులో అవకతవకల అభియోగంపై అచ్చెన్నాయుడిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

ఆయన్ని ఈ నెల 25 నుంచి 27 వరకు అవినీతి నిరోధక శాఖ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ న్యాయస్థానం బుధవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది. 

అనారోగ్యం కారణంగా చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో ఉన్న అచ్చెన్నాయుడి వద్దకు వెళ్లి.. న్యాయవాది, ప్రభుత్వ వైద్యుడి సమక్షంలో మాత్రమే ఏసీబీ అధికారులు విచారణ జరపాలంటూ కోర్టు స్పష్టం చేసింది.

అంతేకాదు, విచారణ సమయంలో అచ్చెన్నాయుడు బెడ్‌పైనే ఉండి సమాధానాలు ఇవ్వవొచ్చని, ఆయన్ని కూర్చోవాలని లేదా లేచి నిలబడి సమాధానాలు ఇవ్వాలని అధికారులు కోరడానికి వీలు లేదని కూడా కోర్టు తన ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొంది.

ఇదంతా ఎలా ఉన్నప్పటికీ, బుధవారం అర్థరాత్రి మాత్రం పరిణామాలు చకచకా మారిపోయాయి. అంతేకాదు, అచ్చెన్నాయుడిని గురువారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయనున్నారని తెలుస్తోంది. 

ఈ నేపథ్యంలో.. అర్బన్ ఎస్పీ అమ్మరెడ్డి, ఇతర పోలీసు అధికారులు బుధవారం రాత్రి అచ్చెన్నాయుడు చికిత్స పొందుతున్న ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించడం గమనార్హం.

మరోవైపు అచ్చెన్నాయుడి తరపు న్యాయవాది హరిబాబు మాట్లాడుతూ.. అచ్చెన్నాయుడిని డిశ్చార్జ్ చేయబోతున్నారనే సమాచారం రావడంతో బుధవారం రాత్రే జీజీహెచ్‌కు వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడమన్నారు.

అర్థరాత్రి సమయంలో డిశ్చార్జ్ ఎలా చేస్తారని ప్రశ్నించగా.. తమ ఉన్నతాధికారులు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని వారు సమాధానమిచ్చారని న్యాయవాది హరిబాబు పేర్కొన్నారు. 

- Advertisement -