బొత్స సత్యనారాయణను బెంబేలెత్తిస్తున్న యువనేత నాగార్జున.. ఎవరో తెలుసా? 

12:44 pm, Fri, 15 March 19
Nagarjuna Shocks to the Bosta Sathyanarayana, Newsxpressonline
విజయనగరం: సార్వత్రిక ఎన్నికలకు పూర్తిస్థాయిలో సిద్ధమైన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎట్టిపరిస్థితుల్లోనూ గెలిచి తీరాలన్న పట్టుదలతో ఉన్నారు. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
తాజాగా గురువారం రాత్రి 126 మందితో కూడి తొలి జాబితాను విడుదల చేసిన సీఎం.. ఉత్తరాంధ్రలో వైసీపీకి కీలక నేతగా ఉన్న బొత్స సత్యనారాయణపై ఓ యువనేతను పోటీకి దింపి అందరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు.
 
తనకు కంచుకోటలా భావించే చీపురుపల్లి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన బొత్స దారుణంగా ఓటమి పాలయ్యారు. టీడీపీ అభ్యర్థి కిమిడి మృణాళిని చేతిలో 23 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. ఈసారి ఆమె ఎన్నికలకు దూరంగా ఉండడంతో ఆమె తనయుడు కిమిడి నాగార్జునను చంద్రబాబు బరిలో నిలిపారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇక్కడ రెండుసార్లు మాత్రమే కాంగ్రెస్ విజయం సాధించింది. 2004, 2009 ఎన్నికల్లో బొత్స సత్యన్నారాయణ కాంగ్రెస్ నుంచి విజయం సాధించారు.
 

రెండోస్థానంతో సరి..

 
రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్‌పై ఆగ్రహంతో ఉన్న ప్రజలు 2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు కూడా దక్కకుండా చేశారు. ఆ ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసిన బొత్స రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు. దీంతో ఆ తర్వాత ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రానున్న ఎన్నికల్లో మళ్లీ చీపురుపల్లి నుంచే పోటీ చేయాలని భావిస్తున్నారు. దీంతో, యువకుడైన నాగార్జున.. బొత్సను ఏమేరకు ఎదుర్కోగలరనే ఆసక్తి ఉత్తరాంధ్ర రాజకీయాల్లో నెలకొంది.
 
అయితే, నాగార్జునకు కుటుంబ నేపథ్యం కలిసి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆయన పెద నాన్న ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు, తల్లి మృణాళిని క్లీన్ ఇమేజ్ నాగార్జున గెలుపునకు దోహదం చేస్తాయని టీడీపీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
 
అమెరికాలో చదువుకున్న నాగార్జున రాజకీయాలపై మక్కువతో స్వదేశానికి వచ్చారు. గత ఏడాది కాలంగా నియోజకవర్గంలో పర్యటిస్తూ కార్యకర్తలను, ప్రజలను కలుస్తూ వస్తున్నారు.  ఈ నియోజకవర్గంలో టీడీపీకి స్థిరమైన ఓటు బ్యాంకు ఇక్కడ టీడీపీకి కలిసి వచ్చే అంశంగా చెబుతున్నారు.