సొంతగూటికి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి.. అదీ అమావాస్య రోజున!

kiran-kumar-reddy-rahul-gandhi
- Advertisement -

kiran-kumar-reddy-rahul-gandhi

అమరావతి: అందరూ అనుకున్నట్లుగానే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సొంత గూటికి చేరారు.  శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో తన అస్థిత్వం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ.. తిరిగి పుంజుకునేందుకు ప్రయత్నిస్తోంది.

- Advertisement -

గతంలో కాంగ్రెస్‌లో ఉండి రాష్ట్ర విభజన తరువాత ఇతర పార్టీల్లో చేరిన పలువురు నాయకులకు కాంగ్రెస్ మళ్లీ గాలం వేస్తోంది.  ఈ నేపథ్యంలోనే  మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీలో పని చేసి ప్రస్తుతం క్రియాశీలకంగా లేని, ఇతర పార్టీల్లో చేరిన నేతలను తిరిగి ఆకర్షించేందుకు కాంగ్రెస్ మెల్లగా పావులు కదుపుతోంది.  మున్ముందు మరింత మంది నాయకులు కాంగ్రెస్‌లో చేరే అవకాశం కనిపిస్తోంది.

ఎన్నికలు సమీపిస్తోన్న తరుణాన…

నిజానికి ఏపీ విభజనను అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చివరి వరకూ తీవ్రంగా ఖండించారు.  తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికల ముందు ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేశారు.  అనంతరం జై సమైక్యాంధ్ర పేరిట సొంత పార్టీని కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆయన ప్రయత్నాలు ఏమాత్రం ఫలించలేదు.  దీంతో నాలుగేళ్లకుపైగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి తిరిగి 2019 ఎన్నికలు సమీపిస్తోన్న తరుణాన కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు.
అమావాస్య రోజున…

అయితే కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరాలని ముందుగానే నిర్ణయించుకున్నప్పటికీ, ఈ రోజు అంటే.. జూలై 13వ తేదీన  శుక్రవారం చేరడమే కాస్త ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే.. శుక్రవారం రోజు అమావాస్య.  అయినా సరే అమావాస్య రోజున ఆయన తిరిగి కాంగెస్‌లో చేరడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.  ఇంకేదైనా మంచి రోజున మూహూర్తం చూసుకొని చేరకుండా.. అందరూ అన్ లక్కీ అని భావించే అమావాస్య రోజున ఆయన పార్టీలో చేరడం చర్చనీయాంశమైంది.

తండ్రి వర్థంతి రోజున…

నిజానికి జూలై 13.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తండ్రి అమర్‌నాథ్ రెడ్డి వర్ధంతి. అందుకే ఈ రోజు ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలుస్తోంది.  ఇక అమావాస్య అంటారా.. ఆ ఘడియలు ముగిశాకే ఆయన పార్టీలో చేరారని చెబుతున్నారు.  అంతేకాదు, ఈ సందర్భంగా కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలందర్నీ తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి చేరుస్తానని వ్యాఖ్యానించారు. మరి ఆయన నిజంగానే తన మాజీ సహచరుల్ని సొంత గూటికి తీసుకొస్తే ఎక్కువ ఎఫెక్ట్ పడేది.. ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా అధికారాన్ని కైవసం చేసుకోవాలని తహతహలాడుతోన్న వైసీపీ మీదే.

- Advertisement -