టీడీపీకి మరో షాక్: పార్టీ సభ్యుడు రాజీనామా, టీఆర్ఎస్ అభ్యర్థిగా?

3:50 pm, Tue, 19 March 19
Nama Nageswara Rao Quits TDP, TRS Latest Updates News, Newsxpressonline

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు ఆ పార్టీని వీడారు. గత కొంతకాలంగా పార్టీపై అసంతృప్తిగా ఉన్న ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.

టీడీపీకి, పొలిట్ బ్యూరో సభ్యత్వానికి నామా నాగేశ్వరరావు మంగళవారం రాజీనామా చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజాకూటమి అభ్యర్థిగా నామా పోటీ చేసిన విషయం తెలిసిందే. అయితే, టీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ చేతిలో ఆయన ఓటమి పాలయ్యారు.

అప్పటి నుంచి టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీకి మనుగడ లేదని భావించిన నామా నాగేశ్వరరావు.. అదికార టీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ఖమ్మం పార్లమెంటు టీఆర్ఎస్ అభ్యర్థిగా…

కాగా, మూడు రోజుల క్రితమే తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోనూ భేటీ అవడం ఇందుకు బలం చేకూరుస్తోంది. నామా టీఆర్ఎస్ పార్టీలో చేరితే.. ఆయనను ఖమ్మం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించేందుకు ఆ పార్టీ సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

ఖమ్మం నుంచి కాంగ్రెస్ తరపున రేణుకా చౌదరి పోటీ చేస్తుండటంతో ఈ పోరు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఇది ఇలావుంటే, ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.