నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత!

12:36 am, Wed, 1 May 19

నంద్యాల: రాయలసీమకు చెందిన ముఖ్య నేత, కర్నూలు జిల్లా నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కొద్దిసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా కిడ్నీ, హృద్రోగ సమస్యలతో బాధపడుతున్న ఎస్పీవై రెడ్డి హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

ఐసీయూలో చికిత్స అందించినప్పటికీ ఆయన ఆరోగ్యపరిస్థితి మెరుగుపడలేదు. ఏప్రిల్ 3 నుంచి కేర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. రాజకీయాల్లో ఎస్పీవై రెడ్డిగా ఆయన అందరికి ఎంతో సుపరిచితులు. ఈతరం వారికి ఆయన ఎస్పీవై రెడ్డిగా మాత్రమే తెలుసు.

ఆయన పూర్తి పేరు పెద్ద ఎరికల్ రెడ్డి. నంద్యాల నంది పైపులతో ‘పైపుల రెడ్డి’గా కూడా ఆయన ఆ ప్రాంతం వారికి సుపరిచితులు. నంద్యాలలో చాలామంది ఆయనను అలానే పిలిచేవారు. ఎస్పీవై రెడ్డి కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా సామాజికవేత్తగా కూడా గుర్తింపు పొందారు. నంద్యాల నియోజకవర్గంలో ఉచితంగా బోర్లు వేయించిన ఘనత ఆయనకే దక్కుతుంది.

ఈయన ఆంధ్రప్రదేశ్ కడపజిల్లా అంకాలమ్మగూడూరు గ్రామంలో జూన్ 4, 1950 న జన్మించారు. వరంగల్ NIT నుంచి మెకానికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ పట్టా పొందారు. ఆయనకు భార్య పార్వతి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రస్తుతం ఎస్పీవై రెడ్డి నంద్యాల నుండి సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున నంద్యాల నుంచి ఎస్పీవై రెడ్డి పోటీచేశారు.

ఎస్పీవై రెడ్డి 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్‌పై గెలిచారు. ఆ తరువాత మారిన రాజకీయ పరిణామాలతో గెలిచిన కొద్ది రోజులకే టీడీపీ వైపు మొగ్గుచూపారు. ఇక ఈ ఎన్నికలలో టీడీపీ టికెట్ ఇవ్వకవపోవడంతో , చివరి నిమిషంలో పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేనలో చేరారు. జనసేన పార్టీ తరపున నంద్యాల బరిలో దిగారు. 2004 నుంచి ఇప్పటి వరకు నంద్యాల ఎంపీగా పనిచేశారు.