అనంతపురం: టీడీపీ నాయకులపై జరుగుతున్న దాడులను సహించబోమని, ఇకపై ఇలా చేస్తే ఊరుకునేది లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ హెచ్చరిక చేశారు.
సోమవారం అనంతపురం చేరుకున్న ఆయన.. జేసీ కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో చట్టాలకు విలువలేకుండా పోయిందని, రాజారెడ్డి
రాజ్యాంగం అమలులో ఉందని విమర్శించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి.. జగన్‌లా దేశాన్ని దోచుకోలేదని, దొంగ కేసులు పెడితే భయపడిపోతామని అనుకుంటే పొరబడినట్లేనని తెలియజేశారు. ‘జగన్ మమ్మల్ని ఏమీ
చేయలేడు. ఇలా కేసులు పెట్టే రాజకీయాలు తమిళనాడులో చూశాం. ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా అదే చేస్తున్నారు. కేసులు చూసి భయపడతామనుకుంటే పొరబడినట్లే’ అని స్పష్టంచేశారు. 16 నెలలు
చిప్పకూడు తిన్న జగన్.. ఏపీ ప్రజలందరికీ అదే గతి పట్టించడానికి ప్రయత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నీ రాసుకుంటున్నాం.. సమయం రాగానే వడ్డీతో సహా తిరిగిచ్చేస్తామని తేల్చిచెప్పారు.
తొందర్లోనే ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజు వస్తుంది జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. ప్రభాకర్‌రెడ్డిపై ఫిబ్రవరి నుంచి 22 కేసులు పెట్టారని, ఇలా తప్పుడు కేసులు పెట్టి ఆయన్ను వేధిస్తున్నారని
విమర్శించారు. జేసీ ప్రభాకర్‌రెడ్డి ఆర్థిక నేరస్థుడు కాదని లోకేష్ చెప్పారు. బడుగు, బలహీనవర్గాలపైన కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. ఇటువంటి సమయాల్లో మాకేం
కాలేదు కదా అని ప్రజలు ఊరుకుంటే.. రేపు ఈ గజదొంగలు అందరిపైనా పడతారని హెచ్చరించారు. ‘‘ఆపరేషన్ చేయించుకుని ఇబ్బంది పడుతున్న అచ్చెన్నాయుడిని శ్రీకాకుళం నుంచి అమరావతికి
నాన్‌స్టాప్‌గా తీసుకొచ్చారు. కోర్టులోకి వెళ్లేందుకు మాకు పర్మిషన్ లేదని ఆపేశారు. మా మనోధైర్యాన్ని దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్ర ఇది. ఈఎస్ఐ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. అమ్మకాలు, కొనుగోళ్లు
అన్నీ డైరెక్టర్లే చూసుకుంటారు. వాహనాలు అమ్మిన డీలర్లను విచారించడం లేదు. ఎవనైనా సరే జగన్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే ఊచలు లెక్కపెట్టాల్సిందేనా? జగన్ జైలుకెళ్లాడు కాబట్టి.. అందరినీ జైలుకి
పంపాలనుకుంటున్నాడు. మేం తప్పు చేయలేదు కాబట్టే బెయిల్ వస్తోంది. జగన్ తప్పుడు పనులు చేశాడు కాబట్టే 16 నెలలు జైల్లో ఉన్నాడు’ అని లోకేష్ నిప్పులు చెరిగారు. 2012 నుంచి తనపై చేసిన
ఆరోపణలను ఆయన గుర్తుచేశారు. రూ. 6 లక్షల కోట్ల అవినీతి చేశానని చెప్పి, కనీసం 6 రూపాయలు కూడా చూపించలేకపోయారని పేర్కొన్నారు.