షర్మిల, మోహన్ బాబు వచ్చినా నా విజయాన్ని ఆపలేరు: లోకేష్

6:18 pm, Wed, 3 April 19
Nara Lokesh Latest News, Sharmila Latest News, Mohan Babu Latest News, Newsxpressonline

గుంటూరు: మంగళగిరి నుంచి బరిలో దిగిన తనను ఓడించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అద్దె తారలను ప్రచారంలోకి దింపుతోందని టీడీపీ అభ్యర్థి, మంత్రి నారా లోకేశ్‌ ఆరోపించారు. యువకుడిగా మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ప్రజల ముందుకు వచ్చానని ఆయన తెలిపారు.

తాడిబోయిన ఉమా యాదవ్ ఆధ్వర్యంలో 1000 మంది బుధవారం టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా లోకేష్‌ మాట్లాడుతూ.. ‘ఇప్పుడు అనేక వలస పక్షులు మంగళగిరికి వస్తున్నాయి.
షర్మిల, మోహన్ బాబు, లక్ష్మి పార్వతి ఇలా అనేక మంది మంగళగిరికి వస్తున్నారు. ఒక్కరైనా మంగళగిరికి.. ఇక్కడి ప్రజలకి ఏం చేస్తారో చెప్పారా? వచ్చి నన్ను తిట్టి వెళ్లిపోవడం పనిగా పెట్టుకున్నారు’ అని అన్నారు.

ఎంతమంది వచ్చినా..

ఎంత మంది వచ్చినా తన విజయాన్ని ఆపలేరని.. మంగళగిరి ఓటర్లు తనవైపే ఉన్నారని లోకేష్ చెప్పారు. సంక్షేమం, అభివృద్ధిలో పోటీ పడలేక అసత్యాలు ప్రచారం చేసుకుంటున్నారన్న లోకేష్‌.. ప్రత్యర్థుల దుష్ప్రచారాన్ని నమ్మవద్దని సూచించారు.

పంచాయతీరాజ్‌ మంత్రిగా మంగళగిరికి రూ.34 కోట్లు మంజూరు చేయించానని.. ఐటీ సంస్థలు తెచ్చి 3 వేల మందికి ఉద్యోగాలు కల్పించానని చెప్పారు. దేశం మొత్తం మంగళగిరి వైపు చూసేలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. రూ.10 వేల కోట్లతో బీసీ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 2024 నాటికి పేదరికం లేకుండా చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు లోకేష్ చెప్పారు.

చదవండి: ఏపీ రైతులకు శుభవార్త: ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ నిధుల జమ