లోకేష్ పోటీ చేసే స్థానంపై చంద్రబాబు క్లారిటీ: ఎక్కడ్నుంచో తెలుసా?

3:27 pm, Wed, 13 March 19
Nara Lokesh to contest from Mangalagiri, Newsxpressonline

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు, ఏపీ మంత్రి నారా లోకేష్ వచ్చే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ్నుంచి పోటీ చేస్తారనే అంశంపై సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. స్వయంగా టీడీపీ అధినేత దీనిపై స్పష్టం ఇవ్వడం గమనార్హం.

టీడీపీ ఇప్పటికే అభ్యర్థుల జాబితాను సిద్దం చేసినప్పటికీ.. పెండింగ్ స్థానాలపై చంద్రబాబు నాయుడు గత రెండ్రోజులుగా తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మంత్రి లోకేష్ పోటీ చేసే స్థానంపై ఆయన స్పష్టమైన ప్రకటన చేశారు.

మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచే..

మంగళగిరి అసెంబ్లీ స్థానం నుంచి లోకేష్ పోటీ చేస్తారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం ప్రకటించారు. తొలుత భీమిలి, విశాఖ ఉత్తరం నియోజకవర్గాల్లో ఏదో ఒక చోటి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ అదంతా ఊహాగానాలేనని తేలిపోయింది. కార్యకర్తల మనోగతం, సామాజిక సమీకరణలను దృష్టి పెట్టుకుని మంగళగిరిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.

గుంటూరు జిల్లా మంగళగిరి నుంచి పోటీ చేస్తారని చంద్రబాబు ప్రకటించడంతో ఇప్పుడు ఆ స్థానంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. మంగళగిరి అసెంబ్లీ పరిధిలోనే లోకేష్‌కు ఓటు హక్కు ఉండటం గమనార్హం. కాగా, గత ఎన్నికల్లో ఈ స్థానం నుంచి వైసీపీ నేత అల్లా రామకృష్ణారెడ్డి గెలుపొందారు.