నిమ్మగడ్డను తిరిగి ఎస్‌ఈసీగా నియమించిన ఏపీ ప్రభుత్వం.. అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మళ్లీ నియమితులయ్యారు. ఈ మేరకు గత అర్ధరాత్రి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రకటన విడుదల చేశారు.

దీంతో నిమ్మగడ్డను తిరిగి ఎస్‌ఈసీగా నియమిస్తున్నట్టు గెజిట్ విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

అయితే, అత్యున్నత ధర్మాసనంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌లో వచ్చే తుది తీర్పునకు లోబడే పునర్నియామకం ఉంటుందని స్పష్టం చేశారు.

కాగా, రమేశ్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది.

సంస్కరణల పేరిట ఎస్‌ఈసీ పదవీకాలాన్ని కుదిస్తూ ఏపీ ప్రభుత్వం గతంలో ఆర్డినెన్స్‌ జారీ చేసింది. పదవీకాలం పూర్తయిందంటూ సాగనంపింది. ఆయన స్థానంలో రాత్రికి రాత్రే తమిళనాడుకు చెందిన రిటైర్డ్‌ జడ్జి జస్టిస్‌ కనగరాజ్‌ను నియమించింది.

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న తనను అర్ధంతరంగా తొలగించడం కుదరదని రమేశ్‌ కుమార్‌ న్యాయపోరాటం ప్రారంభించారు.

ఈ విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. హైకోర్టులో, సుప్రీంకోర్టులో వ్యతిరేక నిర్ణయాలు వచ్చినా… రమేశ్‌ కుమార్‌ను తిరిగి ఎస్‌ఈసీగా నియమించేందుకు ప్రభుత్వ పెద్దలకు మనసు రాలేదు.

దీంతో ఆయన కోర్టు ధిక్కరణ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ నిలిపి వేయాలంటూ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా… స్టే ఇచ్చేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది.

పైగా… హైకోర్టు తీర్పు అమలు కోసం గవర్నర్‌ జోక్యం చేసుకోవాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించింది.

- Advertisement -