24 గంటల గడువు: నారా లోకేష్ నామినేషన్‌పై ఉత్కంఠ

5:46 pm, Tue, 26 March 19
Nara Lokesh Latest News, AP Latest Political News, AP Election Latest News, Newsxpressonline

అమరావతి: మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి నారా లోకేష్ నామినేషన్‌పై ఉత్కంఠ ఏర్పడింది. లోకేష్ సమర్పించిన నామినేషన్ పత్రాల్లో.. ఇంటి అడ్రస్ తాడేపల్లిలోని ఉండవల్లిలో ఉందని పేర్కొన్నారు. కానీ, నోటరీ చేసింది మాత్రం కృష్ణాజిల్లాకు చెందిన లాయర్ సీతారామ్ కావడం గమనార్హం.

కొంత సమయం కావాలంటూ..

ఈ క్రమంలో గుంటూరు జిల్లా తన పరిధిలోకి రానప్పుడు సీతారామ్ ఎలా నోటరీ చేస్తారని మంగళగిరి వైసీపి అభ్యర్థి ఆర్కే ప్రశ్నించారు. నోటరీపై సమాధానం చెప్పాలని నిలదీయగా.. వివరణ ఇచ్చేందుకు లోకేష్‌ తరపు న్యాయవాది సీతారామ్‌.. ఎన్నికల అధికారిని కొంత సమయం అడిగారు. దీంతో ఆయన 24గంటల సమయం ఇచ్చారు.

కాగా, నోటరీ రూల్స్ ప్రకారం లోకేష్ నామినేషన్ చెల్లదన్న వైసీపీ నేతలు అంటున్నారు. తప్పుడు నామినేషన్ పత్రాలు ఇచ్చినందుకు చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. నోటరీ వ్యవహారంపై లోకేష్, ఆయన తరపు లాయర్లు ఇచ్చిన వివరణతో ఎన్నికల అధికారి సంతృప్తి చెందకపోతే నామినేషన్‌ను తిరస్కరించే ప్రమాదం ఏర్పడింది.

మరోవైపు నోటరీ వ్యవహారం చిన్న పొరపాటని.. తప్పు కాదనే వాదిస్తున్నారు. దీనికే నామినేషన్ తిరస్కరించే పరిస్థితి ఉండదంటున్నారు. మంత్రి నారా లోకేష్ మార్చి 22న మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినట్లు తెలిసిందే. కాగా, లోకేష్ ప్రత్యక్ష రాజకీయాల్లో తొలిసారి పోటీ చేస్తుండటం గమనార్హం.

చదవండి: కేటీఆర్ బెదిరిస్తున్నారు: నారా లోకేష్ సంచలన ఆరోపణలు