ఓటమికి భయపడను.. గులాంగిరీ చేయను: పవన్ కళ్యాణ్

1:01 am, Mon, 8 July 19
pawan-in-nri-meet-at-virginia

వాషింగ్టన్: ఓటమికి తాను భయపడే వ్యక్తిని కానని, అలాగే తాను ఎవరికీ గులాంగిరీ చేసేవాడిని కూడా కానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 22వ తానా మహాసభలకు హాజరైన సందర్భంగా వర్జీనియాలో ప్రవాసాంధ్రులు, జనసేన అభిమానులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

గెలిచినప్పుడు పొంగిపోయి.. ఓడినప్పుడు కుంగిపోయే వ్యక్తిని కాదన్నారు. తాను గెలుపోటములను సమానంగా తీసుకుని ముందుకు సాగిపోతానని చెప్పారు. భూమిలో పాతిపెట్టిన చిన్న విత్తే మొలకెత్తడానికి అనేక కష్టాలుపడుతుందని.. అలాంటిది కోట్లాదిమంది భవిష్యత్తు నిర్దేశించే రాజకీయ పార్టీ నడపాలంటే ఎన్ని కష్టాలు పడాల్సి ఉంటుందో తనకు తెలుసునని పవన్ వ్యాఖ్యానించారు.

దెబ్బలు తిన్నా.. ఓటమి ఎదురైనా ప్రజలకు అండగా నిలబడాలని మొదలుపెట్టిన తన ప్రయాణం ఆగదని, ఒక్క ఓటమి తనను వెనక్కి లాగేయలేదని జనసేనాని తెలిపారు. వేల కోట్ల రూపాయలు దోచేసి, అక్రమాలు చేసి.. ఆ తరువాత జైల్లో పెడతారేమో అనుకునే వాళ్లు ఓటమికి భయపడతారేమోగాని తాను భయపడనన్నారు.

అప్పుడే చెప్పా.. నాది పాతికేళ్ల ప్రయాణమని…

జనసేన పార్టీని స్థాపించినప్పుడే నాది పాతికేళ్ల ప్రయాణమని చెప్పానని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. సుదీర్హమైన ప్రణాళిక, లోతైన ఆలోచనతో జనసేన పార్టీని తాను స్థాపించానని.. పాతికేళ్ల ప్రయాణంలో ఇంకెన్నో ఒడిదొడుకులు ఎదుర్కోవలసి ఉంటుందని పవన్ వ్యాఖ్యానించారు.

వాళ్లకు ఒకటే చెప్పాలనుకుంటున్నా…

అసలు 2024 వరకు జనసేన పార్టీ ఉంటుందా? అని కొందరు అడుగుతున్నారని అంటూ.. అలాంటి వాళ్లకు తాను ఒకటే చెప్పదలచుకున్నానని, తన మొదటి సినిమా విజయం సాధించనప్పుడు భవిష్యత్తులో ఇన్ని కోట్ల మంది అభిమానాన్ని పొందుతానని ఎవరైనా ఊహించారా? జనసేన పార్టీ కూడా అంతే అని పవన్ కళ్యాణ్ అన్నారు.

రాజకీయ పద్మవ్యూహంలోకి వెళ్లి వచ్చాం…

డబ్బుతో ముడిపడిన రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే దాలా కష్టం.. కోట్లాదిమంది భవిష్యత్తును నిర్దేశించాలంటే ఎంతో అనుభవం కావాలని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో కొన్ని రాజకీయ పార్టీలు వేల కోట్ల రూపాయలు వెదజల్లాయని, అలాంటి రాజకీయ పద్మ వ్యూహంలోకి జనసేన పార్టీ వెళ్ళి క్షేమంగా తిరిగొచ్చిందని ఆయన వ్యాఖ్యానించారు.

గులాంగిరీ చేయను.. ఆత్మగౌరవంతో ముందుకెళతా…

తానెవరికీ గులాంగిరీ చేయనని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్. ఆత్మగౌరవంతో ముందుకెళతానని, అందరి ఆత్మగౌరవం నిలబెట్టాలన్నదే తన లక్ష్యం అన్నారు. ఆత్మగౌరవం లభించనిచోట వజ్రాలు ఇచ్చినా తాను ఉండనని, వాటిని కిందపడేసి వెళ్లిపోతానని వ్యాఖ్యానించారు.

‘‘నేను మార్పు కోసం వచ్చినవాడిని.. స్వీయ రాజకీయ లబ్ధి చూసుకొనేవాడినైతే బీజేపీ, టీడీపీతో గొడవెందుకు పెట్టుకుంటా. గెలిచే సీట్లు తీసుకొని వారితో కలిసేవాడిని కదా..’’ అని పవన్ వ్యాఖ్యానించారు. తాను ఓడిపోయినా దానిని అవమానంగా భావించడం లేదన్నారు..

‘‘గెలవలేకపోవచ్చు, కానీ చిత్తశుద్ధితో బలమైన పోరాటం చేశా.. పని చేసిన వాళ్ళకి పిలిచి టికెట్‌ ఇచ్చా.. అడుగడుగునా పరాజయం వెనక్కి వెళ్లిపోమని బెదిరిస్తుంది… కానీ ధైర్యంతో ముందుకే వెళ్దాం..’’ అన్నారు పవన్.

అపజయం అనేది వ్యర్థాలను తొలగించుకొంటూ విజయం దిశగా వెళ్ళే ప్రక్రియలో భాగమని ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ఓటమి లేదు.. మజిలీయే ఉంది. ఒక గమ్యం నుంచి మరో గమ్యానికి వెళ్తాను.. జనసేన లక్ష్యం కచ్చితంగా సాధిద్ధాం..’’ అంటూ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.