నేటితరం ఓటర్లు అలాంటివాళ్లు కాదు: పవన్ కళ్యాణ్ ధీమా, అభ్యర్థి ఇంట్లో బిర్యానీ ఆరగింపు…

7:26 pm, Mon, 25 March 19
pawan kalyan

గుంటూరు: నేటి తరం ఓటర్లు డబ్బుకు అమ్ముడుపోయేవారు కాదని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన గుంటూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జనసేన అధికారంలోకి రాగానే 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు తెలిపారు.

కొత్త రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా తానే వస్తానని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఒకరికి ఊడిగం చేసే రోజులు పోయాయని, పల్లకీలు మోసిన ప్రజలనే తాను పల్లకీలు ఎక్కిస్తానని చెప్పారు. తెలుగుజాతి ఆత్మగౌరవం కోసమే పంచె కట్టానన్నారు.

అధికారం కొన్ని కుటుంబాలకేనా?

అధికారం కొన్ని కుటుంబాలకే పరిమితం కాకూడదని పవన్ అన్నారు. గుంటూరులో ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. రూపాయి వాసన చూపిస్తే మోసపోయే తరం ఇది కాదన్నారు.

అతిసారంతో ప్రజల ప్రాణాలు పోయినా టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్‌ పట్టించుకోలేదని మండిపడ్డారు. కమీషన్ల కోసమే గుంటూరులో తరచుగా రోడ్లు, కాలువలు తవ్వుతున్నారని ఆరోపించారు.

జనసేన వస్తే 40 ఏళ్లకు సరిపడా శాశ్వత వ్యవస్థ ఏర్పాటు చేస్తానని భరోసా ఇచ్చారు. వైసీపీ మాదిరిగా డొంకతిరుగుడు రాజకీయాలు తనకు రావని పవన్‌ వ్యాఖ్యానించారు. ఇక్కడ బీజేపీని తిట్టడం, ఢిల్లీ వెళ్లి వారి కాళ్లు పట్టుకోవడం వైసీీపీ నైజమన్నారు. వైసీపీకి ముస్లిం ప్రజల ఓట్లు కావాలిగానీ వారికి పదవులు మాత్రం ఇవ్వరని ధ్వజమెత్తారు.

అభ్యర్థి ఇంట్లో విందుకు…

గుంటూరు జిల్లా ప‌ర్య‌ట‌న‌లో భాగంగా జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్‌ కల్యాణ్ గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి జ‌న‌సేన అభ్య‌ర్థిగా పోటీ చేస్తున్న షేక్ జియా ఉర్‌ రెహ్మాన్ ఇంటిని సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా రెహ్మాన్ త‌ల్లి ఇస్లాం మ‌త గ్రంథాన్ని చ‌దివి వినిపించ‌గా శ్రద్ధగా విన్నారు.

ప‌వ‌న్‌ రాక‌ను పుర‌స్క‌రించుకుని రుచికరమైన వంటలతో ఆతిథ్యం ఏర్పాటు చేశారు. బిర్యానీతోపాటు ఆ రుచికరమైన వంటలను పవన్, పార్టీ ఇతర నేతలు ఆరగించారు.

చదవండి: శృతిహాసన్‌ను బ్లాక్ మెయిల్ చేశారు, మహేష్ దొరకలేదు: పీవీపీపై కేశినేని సంచలనం…