పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానం ఇదే! త్రిముఖ పోటీ తప్పదా?

12:48 pm, Mon, 18 March 19
Pawan Kalyan may contest from Gajuwaka constituency, Newsxpressonline

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానంపై స్పష్టత వచ్చిందా? అంటే అవుననే చెబుతున్నాయి తాజా పరిణామాలు. పిఠాపురం, గాజువాకల్లో ఏదో ఒక స్థానం నుంచి ఆయన పోటీ చేయడం ఖాయమని తెలుస్తోంది. ఆ రెండు స్థానాల నుంచీ పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదని ప్రచారం జరుగుతోంది.

పవన్ కళ్యాణ్ గాజువాకపై కన్నేశారా?

తాజాగా విడుదలైన రెండో జాబితాలో కూడా పవన్ కళ్యాణ్ పేరు లేకపోవడంతో ఈ ఉత్కంఠ మరింత పెరిగింది. కాగా, గాజువాక నుంచి ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలిచిన చింతలపూడి వెంకట్రామయ్య గత సంవత్సరం జనసేనలో చేరారు. అంతేగాక, గాజువాక నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే కసరత్తులు చేసుకున్నారు.

అయితే, గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలున్నట్లు తెలియడంతో.. పెందుర్తిపై వెంకట్రామయ్య దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాపులు అధికంగా ఉన్న పెందుర్తిలో పరిస్థితి సానుకూలంగా ఉంటుందన్న నమ్మకంతో అక్కడ్నుంచి పోటీ చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ క్రమంలోనే జనసేన రెండో జాబితాలో చింతలపూడి వెంకట్రామయ్యకు పెందుర్తి టికెట్‌ను కేటాయించడం గమనార్హం.

ఈ నేపథ్యంలోనే గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతారని పార్టీ శ్రేణులు అంచనాకు వచ్చాయి. కాగా, గాజువాకలో ఇప్పటి వరకు టీడీపీ, వైసీపీలే ప్రధానంగా పోటీ పడ్డాయి. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు విజయం సాధించారు. మరోసారి పల్లాకే టీడీపీ టికెట్ ఖాయమన్న తరుణంలో.. పవన్ పేరు వినిపిస్తుండటంతో సమీకరణలు మారే అవకాశం ఉంది.

గాజువాక నుంచి పవన్ కళ్యాణ్‌ పోటీ చేస్తే.. ఆయనకు తగిన ప్రత్యర్థిని బరిలో నిలపాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలావుంటే, గాజువాక నుంచి వైసీపీ అభ్యర్థిగా తిప్పల నాగిరెడ్డి, బీజేపీ నుంచి పులుసు జనార్ధన్ పోటీలో ఉన్నారు. ఒకవేళ గాజువాక నుంచే పవన్ పోటీ చేస్తే.. ఇక్కడి రాజకీయం మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.