న్యాయవ్యవస్థ పరిపూర్ణ జ్ఞానానికి ఇది అద్దం పడుతోంది: అయోధ్య తీర్పుపై పవన్

6:13 pm, Sat, 9 November 19

హైదరాబాద్: వివాదాస్పద అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు ఈ రోజు వెలువరించిన తీర్పుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. రాజ్యాంగ ధర్మాసనం తీర్పు చారిత్రాత్మకమైనదని ట్విటర్‌లో పేర్కొన్నారు.

భారత న్యాయ వ్యవస్థకున్న పరిపూర్ణమైన జ్ఞానానికి ఈ తీర్పు అద్దం పడుతోందని అన్నారు. భారతీయులమైన తాము కోర్టు తీర్పును హృదయపూర్వకంగా అంగీకరిస్తున్నామని పేర్కొన్నారు. ధర్మాన్ని సమర్థించిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలని అన్నారు.

అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామజన్మభూమి న్యాస్‌కే చెందుతుందని వెల్లడించింది. రామ మందిర నిర్మాణం కోసం మూడు నెలల్లో అయోధ్య ట్రస్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది.

మసీదుకు అయోధ్యలోనే 5 ఎకరాల ప్రత్యామ్నాయ భూమిని కేటాయించాలని సూచించింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అబ్దుల్ నజీర్‌‌లతో కూడిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం తీర్పు చెప్పింది.