చిరంజీవి బాటలోనే జనసేనాని పవన్ కళ్యాణ్

1:04 pm, Tue, 19 March 19
Pawan Kalyan Latest News, Chiranjeevi Strategy for Pawan Seats, Newsxpressonline

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ తన సోదరుడు చిరంజీవి బాటలోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. 2009లో ప్రజారాజ్యం పార్టీ పెట్టి రెండు అసెంబ్లీ స్థానాల నుంచి చిరంజీవి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా తన నాయకత్వంలోని జనసేన పార్టీ తరపున రెండు చోట్ల నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఒక స్థానంపై స్పష్టత.. రెండో స్థానంపై…

ఈ మేరకు పార్టీ కార్యవర్గం నిర్ణయం తీసుకుందని పవన్‌ కళ్యాణ్ మంగళవారం ట్వీట్‌ చేశారు. ఏయే స్థానాల్లో పోటీ చేసే విషయాన్ని గంట తర్వాత వెల్లడిస్తానని పేర్కొన్నారు. అయితే, పవన్‌ పోటీ చేసే ఒక స్థానంపై ఇప్పటికే ఒక స్పష్టత ఉంది.

విశాఖ జిల్లా గాజువాక నుంచి ఆయన పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో స్థానంపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా, 2009 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు, తిరుపతి నుంచి చిరంజీవి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో తిరుపతిలో మాత్రమే చిరంజీవి గెలుపొందారు.

ఇది ఇలావుంటే, బీఎస్పీ, వామపక్షాలతో కలిసి సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేస్తోన్న జనసేన.. మిత్రులకు 35 అసెంబ్లీ, ఏడు పార్లమెంటు స్థానాలకు కేటాయించింది. మిగతా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులను బరిలోకి దించుతున్నారు. ఇప్పటి వరకు మూడు జాబితాల్లో 77 మంది అభ్యర్థులను పవన్ ప్రకటించారు. అయితే, ఆయన పోటీ చేసే స్థానాలపై మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు.