నేను తెలుగువాడ్ని.. అందుకే పంచె కట్టా: పవన్ కల్యాణ్

Pawan Kalyan
- Advertisement -

Pawan Kalyan1

రాజమహేంద్రవరం: రాజ్యాంగం ప్రకారం పాలన అందిస్తే ఎవరికీ ఎటువంటి  ఇబ్బంది ఉండదని, కానీ.. వాస్తవంగా అలా జరగడంలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పెర్కొన్నారు. మంగళవారం ఆయన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో జనసేన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. సర్‌ ఆర్దర్‌ కాటన్‌ ఉన్నత ఆశయంతో ధవళేశ్వరం ఆనకట్ట కట్టారని, అలాగే సీఎం చంద్రబాబు కూడా మంచి ఆశయంతో పోలవరం కట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పారు..

- Advertisement -

గోదావరి జిల్లాలంటే అందరికీ ఇష్టం ఉంటుందని, అలాంటి జిల్లాలో ఆక్వా భూతంతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాబోయే రోజుల్లో తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ పర్యటిస్తానని వెల్లడించారు. ప్రస్తుతానికి  ఈ జిల్లాలో పితాని బాలకృష్ణ పేరు మాత్రమే ప్రకటించామన్నారు. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లి మళ్లీ  ఇక్కడ పర్యటిస్తానని తెలిపారు.

రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని, పెట్టుబడులు రావాలని  పవన్‌ ఆకాంక్షించారు. ప్రజలను భయపెట్టి భూములు లాక్కోకూడదని ప్రభుత్వానికి సూచించారు. సమాజం, దేశం కోసం చనిపోవడానికి కూడా తాను సిద్ధమని ప్రకటించారు.

తాను తెలుగువాడినని చెప్పడానికే పంచె కడుతున్నానని  తెలిపారు. సమాజంలో ఉన్న అసమానతలు చూడలేక వాటి మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చానని  పవన్ పునరుద్ఘాటించారు.

- Advertisement -