నేను చిరంజీవిని కాదు: కరుణాకర్ రెడ్డికి పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక

12:04 pm, Fri, 5 April 19
Pawan Kalyan Latest News, Janasena News, AP Political News, Newsxpressonline

చిత్తూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఒక్క జనసైనికుడిపై చేయి పడినా.. ఒక్క ఆడపడచును ఇబ్బంది పెట్టినా చూస్తూ ఊరుకోబోనని తేల్చి చెప్పారు. అంతేగాక, తోక జాడిస్తే నారతీసి కూర్చోబెడతానని తీవ్రంగా హెచ్చరించారు.

ఇది 2009 కాదని, 2019 అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని పవన్ సూచించారు. తాను చిరంజీవిని కాదనే విషయం కూడా గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. 2009 ఎన్నికల్లో చిరంజీవి లాంటి ఓ బలమైన వ్యక్తిపై కెన్సెస్ హోటల్ వేదికగా కరుణాకర్ రెడ్డి రౌడీ మూక దౌర్జన్యానికి దిగిందని, ఆ ఘటనను తాను ఎన్నటికీ మర్చిపోనని వ్యాఖ్యానించారు.

ప్రతి ఆడపడచు ఓ మాయావతిలా..

జగన్, కరుణాకర్ రెడ్డి లాంటి రౌడీలు ఉత్తరప్రదేశ్‌లో వీధికొకరు ఉంటారని.. అలాంటి రౌడీలను బీఎస్పీ అధినేత్రి మాయావతి రుద్రకాళిలా చీల్చి చెండాడారని పవన్ చెప్పుకొచ్చారు. కరుణాకర్ రెడ్డిని ఓడించడానికి తిరుపతి నియోజకవర్గంలో ప్రతి ఆడపడచు ఓ మాయావతిలా మారాలని పిలుపునిచ్చారు.

టీడీపీ అభ్యర్థిపైనా పవన్ విమర్శలు ఎక్కుపెట్టారు. టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ అల్లుడి అరాచకాలు తిరుపతిలో మితీమిరి పోతున్నాయని మళ్లీ గనక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కబ్జాలు ఎక్కువైపోతాయని పవన్‌ ఆరోపించారు. తిరుపతిలో జనసేన కార్యకర్త వినోద్‌ రాయల్‌ను దారుణంగా చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

బీజేపీ వాళ్లు తెలుగు ప్రజలకు చేసిన మోసం ఏనాడూ మర్చిపోరని పవన్ అన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఏపీ ప్రత్యేక హోదా కోసం మద్ధతు ఇచ్చారని ఈ సందర్భంగా పవన్ అన్నారు. తిరుపతి స్విమ్స్‌ ఆసుపత్రిని ఎయిమ్స్‌ తరహాలో అభివృద్ధి చేస్తామని, తిరుపతిలోని 52 మురికివాడల్లో పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానన్నారు.

చదవండి: టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో పోలీసుల సోదాలు: వారెంట్ లేకుండానే.!