అలీ వైసీపీలోకి వెళ్లడంపై పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

12:49 pm, Thu, 4 April 19
pawan Latest News, YCP Latest News, Ali Latest News, Newsxpressonline

అమరావతి: సినీ నటుడు అలీ మొదటి నుంచీ జనసేన పార్టీలోనే చేరతారని ప్రచారం జరిగింది. అప్పట్లో పవన్‌తో కలిసి అలీ నెల్లూరులో జరిగిన రొట్టెల పండుగకు వెళ్లడంతో.. ఆయన జనసేన తరపున పోటీ చేస్తారని ఊహాగానాలు రెట్టింపు అయ్యాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్‌కు అలీ చాలా సన్నిహితుడు కావడం కూడా ఇందుకు కారణం.

అయితే ఆ తరువాత అలీ అనూహ్యంగా వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో పవన్ అభిమానులు కంగుతిని సోషల్ మీడియాలో అలీ చేసింది నమ్మక ద్రోహమంటూ విరుచుకు పడ్డారు. మరి ఈ విషయమై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏమనుకుంటున్నారన్నది ఆసక్తికరమే. తాజాగా పవన్ ఈ విషయమై మాట్లాడారు.

తనకు మంచి మిత్రుడైన అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై పవన్ తనదైన శైలిలో స్పందించారు. యాక్టర్స్, పాపులారిటీ డిఫరెంట్ అన్న ఆయన.. ‘‘ఎక్కడికి వెళ్లాలనేది అలీ ఛాయిస్. జగన్ బలమైన నాయకుడు అని అలీకి అనిపించి ఉండొచ్చు. టీడీపీ పదవి ఇవ్వకపోవడం కూడా కారణం కావచ్చు..” అని వ్యాఖ్యానించారు.

జనసేనకు మెగాస్టార్ ప్రచారంపై…

జనసేన పార్టీ తరఫున మెగాస్టార్ చిరంజీవి ప్రచారం చేసే అవకాశం లేదని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాలను అన్నయ్య, నేను వేరు వేర్వేరు కోణాల్లో చూస్తామని పవన్ తెలిపారు. ఆ విషయం మా ఇద్దరికీ తెలుసన్నారు.

ఇక జనసేన తరఫున నటులెవరూ ప్రచారం చేయకపోవడానికి కారణమేంటో తనకు తెలియదని పవన్ చెప్పారు. అయితే తనకంటే ప్రజాకర్షణ ఉన్న నటులున్నారని, కానీ తాను యాక్టర్ల మీద ఆధారపడనని, రాజకీయ సిద్ధాంతాల మీద ఆధారపడతానని పవన్ కళ్యాణ్ తెలిపారు.

‘‘స్టార్‌డమ్ అనేది జనాలు రావడం వరకే పని చేస్తుంది. కానీ మాట్లాడాల్సింది మనమే. రాజకీయ అవగాహన, భావజాలం, విధాన నిర్ణయాలపై అవగాహన ఉండాలి. ప్రజాదరణ ఉన్న వ్యక్తికి ఏం మాట్లాడాలనే విషయాలపైనా సరైన అవగాహన ఉండాలి..’’ అని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.

చదవండి: కేసీఆర్ ఇచ్చిన మాటని బయటపెట్టిన జగన్! షాక్‌లో చంద్రబాబు…