టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంట్లో పోలీసుల సోదాలు: వారెంట్ లేకుండానే.!

11:43 am, Fri, 5 April 19
CM Ramesh Latest News, TDP Latest News, AP Political News, Newsxpressonline

కడప: జిల్లాలోని ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తిలోని టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ నివాసంలో శుక్రవారం ఉదయం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. సుమారు 30 మంది పోలీసులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. ఉదయం 6 గంటలకే సీఎం రమేశ్‌ ఇంటికి చేరుకున్నారు.

ఆ సమయంలో సీఎం రమేశ్‌తో పాటు, ఆయన సోదరుడు సురేశ్‌ నాయుడు ఇంట్లోనే ఉన్నారు. మూడంతస్తుల భవనంలో పోలీసులు అణువణువూ సోదాలు చేపట్టారు. ఈ క్రమంలో సెర్చ్‌ వారెంట్‌ ఉందా? అని సీఎం రమేశ్‌ ప్రశ్నించగా.. పోలీసులు మిన్నకుండిపోయినట్లు తెలిసింది.

సోదాలపై సీఎం రమేష్ ఆగ్రహం..

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తనిఖీలు నిర్వహిస్తున్నామని మాత్రం చెప్పారు పోలీసులు. దాదాపు గంటసేపు సోదాలు నిర్వహించారు. ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో వారు వెనుదిరిగారు. అనంతరం సీఎం అనుచరుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు.

కాగా, పోలీసుల తనిఖీలపై సీఎం రమేష్‌ మండిపడ్డారు. కేవలం టీడీపీ నేతలు, అభ్యర్థులే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. కేంద్రంలోని బీజేపీ, జగన్‌ కుమ్మక్కై ఈ దాడులు చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. రెండు రోజుల క్రితమే మైదుకూరు టీడీపీ అభ్యర్థి, టీటీడీ మాజీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ ఇంటిపై ఐటీ దాడులు జరిగిన విషయం తెలిసిందే.

చదవండి: బొత్స సత్యానారాయణకి కాలం కలిసొస్తుందా!