మా మధ్య విద్వేషాలు రెచ్చగొట్టొద్దు: పవన్ కళ్యాణ్‌పై పోసాని ప్రశ్నల వర్షం, తెలంగాణ ప్రజలు దేవుళ్లంటూ..

7:43 pm, Sat, 23 March 19
posani-pawan

హైదరాబాద్: ఆంధ్రా ప్రజలను తెలంగాణలో కొడుతున్నారంటూ వ్యాఖ్యలు చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు ప్రజల మధ్య చిచ్చు పెడతారా? అంటూ పోసాని ప్రశ్నించారు.

‘కేసీఆర్ మంచి సీఎం. బంగారు చెల్లి కవితమ్మ అని పవన్ కళ్యాణే గతంలో అన్నారు. కేసీఆర్ పొగిడారు. కానీ, ఇప్పుడు నాలుగు ఓట్ల కోసం ఆంధ్రప్రజల్ని రెచ్చగొడుతున్నారు’ అని పోసాని ధ్వజమెత్తారు. ఏ జిల్లాలో ఆంధ్రా కుటుంబాలను కేసీఆర్ తరిమికొట్టారని పవన్ కళ్యాణ్‌ను సూటిగా ప్రశ్నించారు.

పవన్ పార్టీ పెట్టేముందు మంచి మాటలు చెప్పారని.. ఇప్పుడు ఏపీ ప్రజలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. ‘ఎప్పుడూ నాలాగే ఎమోషనల్‌గా మాట్లాడతావ్. కొట్టేస్తా అంటావ్. కనీసం ఒకరినైనా కాపాడావా? కనీసం వనజాక్షిని కాపాడావా’ అని పవన్ కళ్యాణ్‌ను పోసాని ప్రశ్నించారు.

మీ ఆస్తులు ఎవరైనా కబ్జా చేశారా?

పవన్ కళ్యాణ్ ఆస్తులు తెలంగాణలోనే ఉన్నాయని, ఆయన సోదరుడు చిరంజీవి ఆస్తులు కూడా అక్కడే ఉన్నాయని.. వాటిని ఎవరైనా కబ్జా చేశారా? అని పోసాని నిలదీశారు. ‘నువ్వు చాలా మంచివాడివి. మరెందుకు ఇలా మాట్లాడావు. నువ్వు చెగువీరా అభిమినివి. ఆయనో ఉద్యమకారుడు… చంద్రబాబేమో వెన్నుపోటుదారుడు. మరి ఆయన్ను ఎందుకు నవ్వుతున్నావ్’ అని పోసాని నిలదీశారు.

‘నువ్వు ఏదైనా చెయ్యు.. కానీ, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య గొడవలు పెట్టకు. ఏం జరిగినా ఎటు తిరిగి జగన్‌నే విమర్శిస్తావు’ అని పోసాని పవన్‌పై అన్నారు. దయచేసి ఏపీ ఓటర్లు తప్పుడు వార్తలు నమ్మొద్దని, హైదరాబాద్‌లో తెలంగాణ-ఆంధ్రావాళ్లు బ్రహ్మాండంగా కలిసి ఉన్నారని పోసాని స్పష్టం చేశారు.

తాను హైదరాబాద్ వచ్చి 36ఏళ్లు అయ్యిందని.. తన దృష్టిలో తెలంగాణ ప్రజలు దేవుళ్లని పోసాని కృష్ణమురళి అన్నారు. తెలంగాణ వాళ్లు తనను చిన్న మాట కూడా అనలేదని, తెలంగాణ బిడ్డలకు ఒక్క టీ ఇస్తే చాలు.. గుండెల్లో పెట్టుకుంటారని చెప్పారు. పవన్ చెప్పేదంతా అబద్దమని, ఏపీ ప్రజలు వాటిని నమ్మొద్దని పోసాని అన్నారు. 

చదవండి: పనిగట్టుకుని ఇలానా?: పవన్ కళ్యాణ్‌కు కేటీఆర్ చురకలు…