నేనెవరినీ పల్లెత్తు మాట అనలేదు: షోకాజ్ నోటీసుపై వైసీపీ ఎంపీ స్పందన

- Advertisement -

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. పార్టీలో కుల రాజకీయాలను ప్రస్తావిస్తూ ఆయన చేసిన వ్యాఖ్య‌లు ఇటీవల సంచలనంగా మారాయి.

ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన అధిష్ఠానం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. అనేక సందర్భాల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆ నోటీసులో పేర్కొంది.

- Advertisement -

ఇటీవల పార్టీ ఎమ్మెల్యేలపై చేసిన వ్యాఖ్యలకు కూడా వారంలోగా వివరణ ఇవ్వాలని కోరింది. లేదంటే తదుపరి చర్యలు తప్పవని హెచ్చరించింది. అధిష్ఠానం పంపిన షోకాజ్ నోటీసుకు రఘురాంకృష్ణం రాజు స్పందించారు.

బుధవారం తనకు 18 పేజీల నోటీసు షోకాజ్ నోటీసు అందిందని తెలిపారు. అందులో రెండు పేజీలు రిటన్ షోకాజ్ కాగా, మరో 16 పేజీల పేపర్ క్లిపింగ్స్ ఉన్నాయని పేర్కొన్నారు.

తాను పార్టీని కానీ, పార్టీ అధ్య‌క్షుడిని కానీ పల్లెత్తు మాట అనలేదని అన్నారు. ప్రభుత్వం ప్రజల మంచి కోసం చేపట్టిన కొన్ని పథకాల్లో ప‌నులు స‌జావుగా జ‌ర‌గ‌ని విష‌యాన్ని మాత్రమే మీడియా ముఖంగా పేర్కొన్నానని గుర్తు చేశారు.

అది కూడా సీఎం అపాయింట్‌మెంట్ దొరకని కారణంగానే మీడియా ద్వారా తెలియజేయాల్సి వచ్చిందన్నారు. త‌న‌కు అందిన నోటీసుకు సమాధానం ఇచ్చేందుకు వారం రోజుల సమయం ఉన్నా రేపు (శుక్రవారం) ఉదయమే చెబుతానని ఎంపీ వివరించారు.

- Advertisement -