ఆ డబ్బు ఎక్కడిది బాబూ..?: ఏపీ సీఎంను ఏకిపారేసిన రాజశేఖర్

7:05 pm, Fri, 5 April 19
rajashekar

అమరావతి: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ సినీనటుడు డాక్టర్ రాజశేఖర్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రతిదీ చంద్రబాబు అమ్ముకున్నారని ఆరోపించారు. అమరావతిని సింగపూర్‌లా చేయడం కోసం అప్పులు ఎందుకు చేయడం? అని ప్రశ్నించారు.

సింగపూర్ కంపెనీకి చంద్రబాబు ఏజెంట్‌గా ఉంటూ.. రైతుల దగ్గర తీసుకున్న భూములకు కమీషన్ పద్ధతిలో ఆ కంపెనీకి అమ్మేశారని ఆరోపించారు. ఇదా ముఖ్యమంత్రి చేసే పని అంటూ రాజశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ డబ్బు ఎక్కడిది బాబూ..

ఏపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడ్డారని, ఈ పరిపాలనను చాలా కంపు చేశారని విమర్శించారు. ఓ బిస్కెట్ వేసినట్లుగా ఎన్నికల ముందు ‘పసుపు-కుంకుమ’ పథకాన్ని తీసుకొచ్చారని రాజశేఖర్ మండిపడ్డారు. ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? అని ప్రశ్నించారు.

చంద్రబాబు ఇంటి నుంచి తెచ్చారా? లేక ఆయన అత్తగారింటి నుంచి తెచ్చారా? అంటూ ఎద్దేవా చేశారు. లేకపోతే సింగపూర్, మలేషియాలో ఉన్న ప్రాపర్టీస్ అమ్మేసి తీసుకొచ్చారా? అంటూ తీవ్ర విమర్శలు చేశారు. ఒక వేళ చంద్రబాబు మహిళలకు మంచి చేయాలనుంటే డ్వాక్రా మహిళల రుణాలను ఎప్పుడో మాఫీ చేయాల్సిందని అన్నారు. కాగా, జీవితతో కలిసి రాజశేఖర్ ఇటీవల వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.

చదవండి: నేను చిరంజీవిని కాదు: కరుణాకర్ రెడ్డికి పవన్ కళ్యాణ్ తీవ్ర హెచ్చరిక