కేశినేని అలకకి కారణం ఇదేనా…!

3:27 pm, Wed, 5 June 19
Kesineni Nani Latest News, TDP Latest News, Chandrababu Naidu News, Newsxpressonline

విజయవాడ: గత నాలుగు రోజులుగా విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని….సొంత పార్టీపై తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ క్రమంలోనే ఆయన మొన్న పార్టీ ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు.

అలాగే నేడు లోక్ సభలో టీడీపీ విప్ పదవిని ఆయన తిరస్కరించారు. ఈ పదవికి తాను అర్హుడిని కాదనీ, మరొకరికి అప్పగించాలని టీడీపీ అధినేత చంద్రబాబును కోరారు. అయితే కేశినేని నాని అలక వెనుక మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

తాజాగా చంద్రబాబు…అందరికీ అందుబాటులో ఉండేలా విజయవాడలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించాలని పలువురు టీడీపీ నేతలు కోరారు. దీంతో ఈ బాధ్యతలను టీడీపీ అధినేత కేశినేని నానికి అప్పగించారు. అయితే మధ్యలో ఏమైందో తెలియదు కానీ, పార్టీ కార్యాలయం ఏర్పాటు బాధ్యతలు మంత్రి దేవినేని ఉమకు ఇచ్చారు.

అయితే తనకు చెప్పాపెట్టకుండా పార్టీ అధిష్టానం మరొకరికి బాధ్యతలనీ అప్పగించడంపై నాని కలత చెందినట్లు సమాచారం. అందువల్లే లోక్ సభలో టీడీపీ విప్ పదవిని సైతం కేశినేని నాని తిరస్కరించారని తెలుస్తోంది.

కేశినేనినీ బుజ్జగిస్తున్న అధిష్టానం..

మరోవైపు కేశినేని నానీని బుజ్జగించటానికి అధిష్టానం రంగంలోకి దిగింది. కేశినేనిని బుజ్జగించేందుకు హైకమాండ్ టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత గల్లా జయదేవ్‌ ను పంపించింది.

విజయవాడలో నానితో భేటీ అయిన గల్లా జయదేవ్…తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. గల్లా జయదేవ్ కేశినేని నానీని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీపై అలక వహించడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

ఇదిలా ఉంటే కేశినేని త్వరలోనే బీజేపీ తీర్ధం పుచ్చుకుంటున్నారని అందుకే…టీడీపీకి దూరం జరుగుతున్నారని ప్రచారం జరుగుతుంది. మరి కేశినేని అలక వెనుక అసలు కారణాలు ఏంటో తెలియాల్సి ఉంది.

చదవండి: కేశినేని, సీఎం రమేశ్‌లకు కీలక బాధ్యతలు అప్పజెప్పిన చంద్రబాబు..