ఉరకలెత్తుతున్న గోదావరి.. జలదిగ్బంధంలో దేవీపట్నం.. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం

- Advertisement -

దేవీపట్నం: గోదావరి మహోగ్రరూపం సంతరించుకుంది. భద్రాచలం, ధవళేశ్వరం వద్ద గంటగంటకూ నీటి ప్రవాహం పెరుగుతోంది. లంక గ్రామాలు పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుపోవడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.

అంతకంతకూ పెరుగుతున్న వరద ప్రవాహం ఒకవైపు, కరోనా భయం మరోవైపు వేధిస్తుండడంతో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వేలాది ఇళ్లు, పంటపొలాలు నీట మునిగిపోయాయి.

- Advertisement -

తూర్పు గోదావరి జిల్లాలోని దేవీపట్నం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది. వరద ప్రవాహం పెరగడంతో మండలంలోని 36 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

మరోవైపు, ప్రవాహం గండిపోచమ్మ అమ్మవారి ఆలయ గోపురాన్ని తాకుతూ దిగువకు ప్రవహిస్తుండడం గమనార్హం. ముంపు గ్రామాల్లో గత నాలుగు రోజులుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో కొండలపై ఉన్న వరద బాధితులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

దేవీపట్నం, చినరమణయ్యపేట, పోచమ్మగండి, దండంగి మధ్య ఆర్‌ అండ్ బీ రహదారులపై వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తుండడంతో మైదాన ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

చాలా గ్రామాల ప్రజలు ఇంకా కొండలపైనే తలదాచుకుంటున్నారు. ముంపు గ్రామాల్లో దాదాపు 3 వేల ఇళ్లు నీట మునిగాయి. సోమవారం సాయంత్రానికి అమ్మవారి ఆలయ గోపురాన్ని వరదనీరు చుట్టుముట్టింది.

ఆలయంతో పాటు పోచమ్మగండిలో ఉన్న 50 ఇళ్లు కూడా నీట మునిగాయి. గతేడాది వచ్చిన వరదలకు అమ్మవారి ఆలయం శ్లాబ్ వరకు మాత్రమే వరద నీరు రాగా, ఈసారి వరదలకు నీరు ఏకంగా ఆలయ గోపురానికి చేరుకోవడం గోదావరి ఉగ్రరూపానికి అద్దం పడుతోంది.

మరోవైపు, భద్రాచలం వద్ద నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. రాత్రి 9 గంటల తర్వాత నీటిమట్టం 63 అడుగులకు చేరుకునే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల సంఘం అధికారులు పేర్కొన్నారు.

భద్రాచలం నుంచి వస్తున్న వరద నీరు ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ వద్దకు చేరుకుంటోంది. ధవళేశ్వరం వద్ద నీటి మట్టం 17.90 అడుగులకు చేరగా, సముద్రంలోకి 19.21 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

- Advertisement -