కళ్లు తెరిస్తే చాలు.: షర్మిల, రోజాపై సాదినేని యామిని తీవ్ర విమర్శలు

7:06 pm, Mon, 25 March 19
sadineni yamini

అమరావతి: టీడీపీ అధికార ప్రతినిధి సాదినేని యామిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు రోజా, వైఎస్ షర్మిలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ గురించి మాట్లాడటానికి షర్మిలకు ఉన్న అర్హతేంటని ఆమె ప్రశ్నించారు. రోజాకు, షర్మిలకు పెద్ద తేడా లేదని వ్యాఖ్యానించారు. 

సోమవారం యామిని మీడియాతో మాట్లాడారు. షర్మిల ప్రచారం చేస్తే.. ఆ వచ్చే నాలుగు సీట్లు కూడా జగన్‌కి రాకుండా పోతాయంటూ ఎద్దేవా చేశారు. జగన్ అధికారంలోకి వస్తే ప్రపంచ పటం నుంచి ఏపీని తీసేస్తారని ఆరోపించారు.

రోజా మాటలను రాష్ట్రంలో ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. రోజా మాటలు, భావాలనే వైఎస్ షర్మిల తన నోట పలికించారంటూ ఎద్దేవా చేశారు.

బూతద్దం అవసరం లేదు.. కళ్లు తెరిస్తే చాలు..

మంగళగిరి నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి ఆర్కే ఓడిపోవడం ఖాయమని, ఈ విషయం తెలిసిన షర్మిల, రాజధాని అమరావతి గురించి, పోలవరం ప్రాజెక్టుపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. బూతద్దం పెట్టి చూసినా ఏపీలో అభివృద్ధి కనపడదని షర్మిల చేసిన వ్యాఖ్యలపై సాధినేని యామిని మండిపడ్డారు.

బూతద్దం అక్కర్లేదు, మూసుకుపోయిన కళ్లు తెరచి చూస్తే చాలు ఏపీలో అభివృద్ధి కనబడుతుందని హితవు పలికారు. సీఎం చేసిన అభివృద్ధి గురించి ప్రశ్నించడానికి మీకు ఎటువంటి అర్హత ఉందని కోటి మంది అక్కాచెల్లెళ్లు ప్రశ్నిస్తున్నారు. దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఏపీని నిలబెట్టిన వ్యక్తి చంద్రబాబు అని ప్రశంసించారు.

సినీ రచయిత కోన వెంకట్ టీడీపీపై విమర్శలుచేయడం తగదన్నారు. బ్రాహ్మణుల మధ్య చిచ్చు పెట్టాలని ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కోన వెంకట్ ఎన్ని చెప్పినా బ్రాహ్మణులంతా టీడీపీ వెంటే ఉంటారని యామిని అన్నారు.

చదవండి: శృతిహాసన్‌ను బ్లాక్ మెయిల్ చేశారు, మహేష్ దొరకలేదు: పీవీపీపై కేశినేని సంచలనం…