మండల స్థాయి నుంచి ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా.. సోము వీర్రాజు విజయ ప్రస్థానం

4:15 pm, Tue, 28 July 20

అమరావతి: బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు నియమితులయ్యారు. ఇప్పటివరకు ఈ పదవిలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ స్థానంలో సోము వీర్రాజు నూతనంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.

ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ మేరకు సోము వీర్రాజును నియమించారంటూ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ప్రధాన కార్యాలయ ఇన్‌చార్జ్‌ అరుణ్‌ సింగ్‌ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నియామకం తక్షణం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ మండలం కాతేరు గ్రామానికి చెందిన సోము సూర్యారావు, గంగమ్మ దంపతులకు 1957లో వీర్రాజు జన్మించారు.

విద్యార్థి దశలో ఏబీవీపీలో పనిచేసిన ఆయన బీఎస్సీ చదివారు. వృత్తి వ్యాపారం. వీర్రాజు మొదటి నుంచి బీజేపీతోనే ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయనకు అన్ని జిల్లాల్లో పార్టీ కార్యకర్తలతో సంబంధాలు ఉన్నాయి.

1978లో జనతా యువమోర్చానగర ప్రధాన కార్యదర్శిగా అరంగేట్రం చేశారు. 1980లో యువమోర్చా తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, 1982–1984 వరకు బీజేపీ జిల్లా కార్యదర్శిగా, 1987–90 వరకు యువమోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, 1991–94 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, 1994–96 వరకు యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా, 1996–2003 వరకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా, 2003 నుంచి పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు.

2006–10 వరకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2010–13 తిరిగి రెండోసారి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 2013–14 వరకు మొదటిసారి, 2014 నుంచి ఇప్పటి వరకు రెండోసారి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యునిగా కొనసాగుతున్నారు.

2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ ఎన్నికల కమిటీ కన్వీనర్‌గా పనిచేశారు. ప్రస్తుతం ఏపీ శాసనమండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు. 2015 నుంచి 2018 వరకు ఆయన శాసనమండలి బీజేపీ పక్షనేతగా వ్యవహరించారు.