ప్రశ్నిస్తానంటూ వచ్చి ఆయనే ప్రశ్నగా మారాడు!: సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు…

- Advertisement -

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌లపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రశ్నిస్తానంటూ రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ తానే ఓ ప్రశ్నగా మిగిలిపోయారంటూ ఎద్దేవా చేశారు. ఒకరికి కొమ్ముకాసే వ్యక్తిగా పవన్ మిగిలిపోతారని విమర్శించారు.

బీజేపీ మంచి ఉద్దేశ్యంతో పవన్ కల్యాణ్‌ను పార్టీలోకి ఆహ్వానించిందన్నారు. పవన్ డబుల్ గేమ్ ఆడుతున్నారని మండిపడ్డ సోము… ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన మాయావతికి పవన్ సాష్టాంగ నమస్కారం చేయడం ఏంటి? అని ప్రశ్నించారు. 2014లోనే బీజేపీ, జనసేన కలసి పోటీ చేస్తే బాగుటుందని పవన్‌కు సూచించామని గుర్తుచేసుకున్న ఆయన.. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని పవన్ తెలిపారన్నారు.

సామాజిక వర్గాన్ని ముంచిన పవన్.. బాబుకు ఓటేస్తే..

ఇక సామాజిక వర్గాన్ని ముంచిన వ్యక్తి పవన్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు సోము వీర్రాజు. రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉండటానికి కారణం పవనే అని ఆరోపించారు. ఒక సామాజిక వర్గం తీవ్రంగా చంద్రబాబును వ్యతిరేకించడంతో పథకం ప్రకారం టీడీపీపై విమర్శలు చేశారన్నారు. మరోవైపు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబుపైనా సోము వీర్రాజు విమర్శలు గుప్పించారు.

చంద్రబాబుకు ఓటేస్తే రాష్ట్రం 40 సంవత్సరాలు వెనుకబడుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ రూ.6 లక్షల కోట్లు ఇచ్చారన్న సోము వీర్రాజు.. కేంద్రం ఇచ్చిన నిధులు చంద్రబాబు దిగమింగారని ఆరోపించారు.

రాజధాని నిర్మాణం చేయలేని చంద్రబాబు రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక, మట్టి తవ్వి వేల కోట్లు సీఎం చంద్రబాబు దోచేశారని మండిపడ్డ సోము వీర్రాజు.. పోలవరం నిర్మాణానికి రూ. 7 వేల కోట్లు, మట్టి తవ్వడానికే రూ. 16 వేల కోట్ల బిల్లు పెట్టారని ఆరోపించారు.

చదవండి: ప్రజలపై నోట్లు విసిరిన వైసీపీ పార్టీ నేతలు: కేసు నమోదు
- Advertisement -