విశాఖ నుంచి బాలకృష్ణ అల్లుడు పోటీ ఖాయం?: పురంధేశ్వరి బరిలో నిలిస్తే రసవత్తరమే..

4:20 pm, Mon, 18 March 19
sri bharat may contest from Visakha MP seat, Newsxpressonline

విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో టీడీపీ జోరు పెంచింది. ఇప్పటికే పలువురు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, విశాఖ లోక్‌సభ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఎమ్మెల్యే బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్‌ను ఎంపిక చేయాలని జిల్లాలోని మెజారిటీ నేతల నుంచి అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఈ స్థానం నుంచి అభ్యర్థి ఎంపికను ఖరారు చేసేందుకు విశాఖ జిల్లా టీడీపీ నేతలు, ఎమ్మెల్యేలు మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో సోమవారం సమావేశమయ్యారు. ఈ భేటీకి భరత్‌తో పాటు ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, పల్లా శ్రీనివాసరావు, పంచకర్ల రమేశ్‌బాబు, వాసుపల్లి గణేశ్‌, గణబాబు హాజరయ్యారు.

విశాఖ స్థానం కోసం శ్రీభరత్ ఆసక్తి..

అనంతరం మంత్రి గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ.. విశాఖ లోక్‌సభ స్థానానికి భరత్‌ ఆసక్తిగా ఉన్న అంశాన్ని సీఎంకు తెలిపామన్నారు. ఈ స్థానంలో అభ్యర్థి ఎవరన్న విషయంపై సాయంత్రం నిర్ణయం వెలువడే అవకాశముందని తెలిపారు. దాదాపు శ్రీభరత్ పోటీ ఖాయమైనట్లేనని తెలుస్తోంది.

కాగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అసంతృప్తులు వంశీ, కోలా గురువులు తనను కలిశారని.. వారి అంశాన్ని కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లానని గంటా శ్రీనివాస్ చెప్పారు. వారికి సముచిత గౌరవం కల్పించే విషయంపై సీఎం నిర్ణయం తీసుకుంటారని గంటా తెలిపారు. ఈ నేపథ్యంలో విశాఖ ఎంపీ సీటు శ్రీభరత్‌కు ఖారారైనట్లేనని తెలుస్తోంది.

ఇది ఇలావుంటే, బీజేపీ తరపున బాలకృష్ణ సోదరి పురంధేశ్వరి విశాఖ లోక్‌సభ నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. అదే జరిగితే విశాఖ పార్లమెంటు ఎన్నికలు రసవత్తరంగా సాగే అవకాశం ఉంది.