టీడీపీ నాయకులపై అక్రమ కేసులు.. జైలుపాలు, ఇదే సాధించింది: వైసీపీ ఏడాది పాలనపై టీడీపీ అర్జునుడి వాగ్బాణాలు…

- Advertisement -

గుంటూరు: రాష్ట్రంలో టీడీపీ నాయకులను అణిచివేయడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం పాలన సాగుతోందని, వైసీపీ ఏడాది పాలనలో జరిగింది ఇదేనని మీడియాతో మాట్లాడుతూ టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు వ్యాఖ్యానించారు. 

వైసీపీ ప్రభుత్వం ఇప్పటి వరకు 340 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించిందని, 51 మంది టీడీపీ నాయకులను జైలుపాలు చేసిందని ఆయన ధ్వజమెత్తారు.

- Advertisement -

అరాచకత్వంతో, ప్రజలను ముఖ్యంగా ప్రజల పక్షాన వివిధ అంశాలపై పోరాటం సాగిస్తోన్న టీడీపీ నాయకులను భయభ్రాంతులకు గురిచేసి పాలన సాగించాలనుకుంటున్నారని అర్జునుడు పేర్కొన్నారు.

టీడీపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన నిలిచి వైసీపీ ప్రభుత్వం అరాచకాన్ని, అసమర్థ విధానాలను ఎక్కడికక్కడ అడ్డుకుంటూ పోరాటం సాగిస్తోందని అన్నారు.

శాసన మండలిలో 54 బిల్లులకు టీడీపీ ఆమోదం తెలిపిన విషయాన్ని వైసీపీ శ్రేణులు మరిచిపోరాదన్నారు. ఆంగ్ల భాషలో విద్యాబోధన, రాజధాని అభివృద్ధి, సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల ఏర్పాటు తదితర బిల్లులను వ్యతిరేకించామన్నారు.

వైసీపీ నాయకులు నిజాయితీపరులైతే శాసనమండలిలో జరిగిన సంఘటనలకు సంబంధించిన వీడియో ఫుటేజిని బయటపెట్టాలని తాము ఛాలెంజ్ విసురుతున్నట్లు ఎమ్మెల్సీ అర్జునుడు చెప్పారు.

ఏడాది కాలంలో 800 దాడులు…

ఏడాది కాలంలో టీడీపీ నాయకులపై 800 దాడులు జరిగాయని ఆయన తెలిపారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ వర్గాలపైనే 286 కేసులు పెట్టారంటే ఇక మిగతా వారి పట్ల ప్రభుత్వ ధోరణి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు.

రాష్ట్రంలో మహిళలు సుమారు 4,987 ఫిర్యాదులు చేస్తే.. వాటిపై పోలీసు స్టేషన్లలో కేసులే నమోదు కాలేదన్నారు. గతంలో ఉన్న మంచి పేరు, గౌరవాన్ని ప్రస్తుతం పోలీసు వ్యవస్థ కోల్పోయిందన్నారు. 

ఏపీలో పోలీసు ప్రభుత్వం నడుస్తోందంటూ స్వయంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డే వ్యాఖ్యానించిన విషయాన్ని అర్జునుడు ఈ సందర్భంగా గుర్తు చేశారు.  

‘‘న్యాయస్థానాల దయతో ప్రజాస్వామ్యం…’’

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాస్వామ్యం న్యాయస్థానాల తీర్పులతోనే మనగలుగుతోందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిందే పోలీసు వ్యవస్థ అని, అలాంటి పోలీసు వ్యవస్థ ప్రస్తుతం అధికార పక్షానికి కొమ్ముకాస్తోందని విమర్శించారు.

రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పనితీరును న్యాయస్థానాలే ప్రశ్నిస్తున్నాయి. పోలీస్ బాస్ ఇప్పటికే మూడుసార్లు న్యాయస్థానాల మెట్లు ఎక్కాల్సి వచ్చింది.. ఇది దేనికి నిదర్శనం? అని అర్జునుడు ప్రశ్నించారు.

ఇకనైనా పోలీసు యంత్రాంగం కళ్లు తెరవాలని హితవుపలికారు. అధికార పక్షానికి తలొగ్గి అధికార యంత్రాంగం పని చేయడం ఇక ఎంతోకాలం సాగదని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రజలు తమ సమస్యలు విన్నవించుకోవడానికని ప్రజా వేదికను గత ప్రభుత్వం నిర్మిస్తే.. అధికారంలోకి వచ్చిన వెంటనే అక్రమకట్టడం అంటూ దాన్ని కూల్చివేసి, రూ.11 కోట్ల ప్రజాధానాన్ని వృథా చేశారని తెలిపారు.

కనీసం కూల్చిన భాగాలను కూడా అక్కడ్నించి తొలగించలేదని, అదేదో స్మారకచిహ్నం అన్న రీతిలో వ్యవహరిస్తున్నారని, కేవలం తమ నాయకుడు చంద్రబాబును బాధ పెట్టడమే వారి ఉద్దేశంగా కనిపిస్తోందని అన్నారు.

ఏడాది తరువాత ఇప్పుడు శాంతియుతంగా ఆ విషయం ప్రజలకు గుర్తుచేద్దామని టీడీపీ నేతలు వెళితే వారిని ఉండవల్లిలో వారిపై దౌర్జన్యకాండ సాగించారని అర్జునుడు పేర్కొన్నారు.

టీడీపీ నేతలను అరెస్టు చేసి దాదాపు రెండున్నర గంటలపాటు మంగళగిరి పోలీసుస్టేషన్‌లో నిర్బంధించడంపై ప్రభుత్వం ఆలోచన, విధానం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

కరకట్టపై నిర్మించిన ఏ ఇతర భవనాన్ని ఇప్పటి వరకు కూల్చివేయలేదని, గోకరాజు గంగరాజు భవనాన్ని తాకలేని అసమర్థ ప్రభుత్వమిది అని అర్జునుడు వ్యాఖ్యానించారు.

ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఏడాది కాలంలో సాగించిన అరాచకత్వాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్లు వైసీపీ ప్రభుత్వానికి నాశనమైపోయే కాలం దగ్గర పడిందని వ్యాఖ్యానించారు.

- Advertisement -