చెవిలో క్యాలీఫ్లవర్! టీడీపీ ఎంపీ వింత నిరసన, వైసీపీ ఎంపీలపై విమర్శలు

- Advertisement -
తిరుపతి: టీడీపీ ఎంపీ శివప్రసాద్ స్టయిలే వేరు.  వినూత్న పద్ధతుల్లో నిరసన వ్యక్తం చేయడం ఆయన హాబీ.  ఏపీకి ప్రత్యేక హోదా సాధన విషయంలో ఆ మధ్య  పార్లమెంట్ వెలుపల ఆయన రోజుకో రకం వేషధారణతో నిరసన వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.  తాజాగా మంగళవారం కూడా ఎంపీ శివప్రసాద్ తనదైన శైలిలో నిరసన వ్యక్తం చేశారు.  ఈసారి దీనికోసం ఆయన పూలు, క్యాలీఫ్లవర్ ఎంచుకున్నారు.
వైసీపీ ఎంపీల రాజీనామాలన్నీ నాటకాలేనని, వైసీపీ ఎంపీలు జనాల చెవిలో పూలు పెడుతున్నారని విమర్శించారు. 2015 నుంచి రాజీనామాలంటూ వాయిదా వేస్తూ ఇప్పుడు డ్రామాను రక్తికట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.  ఈ సందర్భంగా తన చెవిలో పువ్వులు, క్యాలీఫ్లవర్ పెట్టుకుని మరీ ఎంపీ శివప్రసాద్ నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు ప్రధాని నరేంద్ర మోడీ డైరెక్షన్‌లో పనిచేస్తున్నారని శివప్రసాద్ ఆరోపించారు. అయితే ఇలాంటి మాయమాటలతో ప్రజలను ఎంతో కాలం వారు మోసగించలేరని, వైసీపీ నేతల మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీ.. పవన్‌, జగన్‌తో కలిసి  కుట్రపూరిత రాజకీయాలు సాగిస్తున్నారంటూ మండిపడ్డారు.  స్వచ్ఛభారత్ గురించి మోడీ ఉపన్యాసాలు చెబుతారని, నిజానికి ఆయన సొంత నియోజకవర్గం వారణాసిలోనే శుభ్రత లేదని వ్యాఖ్యానించారు. జీవితంలో ఒక్కసారైనా చూడాలని ప్రజలు ఆశపడే కాశీలో పరిశుభ్రత మచ్చుకైనా కానరాదంటూ మండిపడ్డారు. కుట్రలు, కుతంత్రాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరన్నారు.  అంతేకాదు, అసలు కుటుంబం లేని మోడీకి ప్రజల బాధలు ఏం అర్థమవుతాయని ఎంపీ శివప్రసాద్ ఎద్దేవా చేశారు. ఇక జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌‌ను పరిపక్వత లేని నాయకుడిగా ఆయన అభివర్ణించారు. అసలు పవన్‌ ఏం మాట్లాడుతున్నారో అర్థమే కావడం లేదన్నారు.
- Advertisement -