టీడీపీకి షాక్: జనసేనలోకి ఎంపీ ఎస్పీవై రెడ్డి, నంద్యాల టికెట్ ఖాయం

10:30 am, Thu, 21 March 19
Chandrababu Latest News, Janasena Latest Updates News, Pawan Kalyan News, Newsxpressonline

విజయవాడ: కర్నూలులో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో ఆ పార్టీలో చేరారు. ఎస్పీవై రెడ్డికి జనసేన కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పవన్ కళ్యాణ్.

ఎస్పీవై రెడ్డితోపాటు ఆయన కుమార్తె కూడా..

ఎస్పీవై రెడ్డితో పాటూ ఆయన కుమార్తె సుజల కూడా జనసేనలో చేరారు. ఎన్నికల్లో ఎస్పీవై రెడ్డి జనసేన తరపున నంద్యాల ఎంపీగా పోటీచేసే అవకాశముందని తెలుస్తోంది. ఎస్పీవై రెడ్డి 2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లా నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైసీపీ తరపున ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు.

ఈసారి ఎన్నికల్లో టీడీపీ నుంచి టికెట్ ఖాయమని ధీమాతో ఉండగా.. చంద్రబాబు షాకిచ్చారు. ఎస్పీవైకి కాకుండా.. నంద్యాల ఎంపీ టిక్కెట్‌ను మాండ్ర శివానంద్‌రెడ్డికి కేటాయించారు. దీంతో టీడీపీ తనను మోసం చేసిందని ఆవేదన చెందిన ఎస్పీవై రెడ్డి నంద్యాల నుంచి ఇండిపెండెంట్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.

ఈ సమయంలోనే ఎస్పీవై రెడ్డికి జనసేన పార్టీ నుంచి ఆహ్వానం పలికింది. పార్టీలో చేరితే నంద్యాల టిక్కెట్ ఇస్తామని జనసేన ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తన అనుచరులతో చర్చించిన ఎస్పీవై రెడ్డి.. జనసేనలో చేరాలని నిర్ణయించుకున్నారు. బుధవారం పవన్ కళ్యాణ్‌ను కలిసి జనసేనలో చేరారు.