టీడీపీకి షాక్! సిట్టింగ్ ఎమ్మెల్యే రాజీనామా.. నేడు వైసీపీ తీర్థం!

12:21 pm, Sat, 23 March 19
TDP resigned as sitting MLA News, TDP Latest Updates, YCP Latest News, Newsxpressonline

అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్నప్పటికీ రాజకీయ వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. పి.గన్నవరం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

పులపర్తి ప్రాతినిథ్యం వహిస్తున్న పి.గన్నవరం నియోజకవర్గం టికెట్ ఆయనకు కాకుండా నేలపూడి స్టాలిన్ బాబుకు ఇవ్వడంపై ఆయన ఆగ్రహంతో ఉన్నారు. స్థానికేతరుడు అయిన స్టాలిన్ బాబుకు ఇవ్వడంతో అలకబూనిన పులపర్తి ఆ పార్టీకి గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

జగన్‌ని సీఎంగా చూడటమే లక్ష్యం…

శుక్రవారం తన అనుచరులతో సమావేశమైన పులపర్తి నారాయణ మూర్తి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. టీడీపీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో శనివారం వైసీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ సమక్షంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే పులపర్తి అనుచరుల్లో కొంతమంది జనసేన పార్టీలో చేరాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే నియోజకవర్గంలోని టీడీపీ క్యాడర్, ముఖ్యంగా ఎమ్మెల్యే పులపర్తి నారాయణ మూర్తి అనుచరులు జనసేనలోకి వెళ్లిపోయారు. అయితే పులపర్తి నారాయణ మూర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా? లేక జనసేన తీర్థం పుచ్చుకుంటారా? అన్నది  మరికొద్ది గంటల్లో తేలనుంది.

ఇకపోతే పులపర్తి నారాయణ మూర్తి 1994 ఎన్నికల్లో నగరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1999లో పొత్తులో భాగంగా నగరం నియోజకవర్గం పొత్తులో భాగంగా బీజేపీ కేటాయించడం జరిగింది.

2004, 2009 ఎన్నికల్లో పాముల రాజేశ్వరి దేవి చేతిలో ఓటమిపాలయ్యారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికొండేటి చిట్టిబాబుపై 13505 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు పులపర్తి నారాయణ మూర్తి.