ఏపీలో టీడీపీకి మరో భారీ షాక్.. బీజేపీలోకి గంటా?

6:59 pm, Sat, 9 November 19

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగలబోతోంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.

మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఆయన బాటలోనే నడిచే అవకాశం ఉందని సమాచారం. బీజేపీలో చేరే ఉద్దేశంతో ఆయన గత రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసినట్టు ప్రచారం జరుగుతోంది.

హస్తినలో గంటా శ్రీనివాసరావు బీజేపీ ముఖ్యనేత రాంమాధవ్‌తో సమావేశమైనట్టు సమాచారం. ఈ సందర్భంగా బీజేపీలో చేరేందుకు గంటా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

గంటాతో పాటు బీజేపీలోకి వచ్చేందుకు మరో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిద్దరితో ఇప్పటికే కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి మంతనాలు సాగించినట్లు సమాచారం.

గంటా వైసీపీలోకి కాకుండా బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఢిల్లీలో జరుగుతున్న పరిణామాలు ఇందుకు ఊతమిస్తున్నాయి.