ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్‌తో దోస్తీ: పురంధేశ్వరి, చంద్రబాబు కాదు.. చందా బాబు: సునీల్ థియోడర్

babu-purandheswari-sunil-theodar
- Advertisement -

babu-purandheswari-sunil-theodar

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై బీజేపీ మహిళా నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం ఆమె కర్నూలులో విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని తిరిగి కాంగ్రెస్‌తో దోస్తీ చేస్తున్నారంటూ నిలదీశారు.

- Advertisement -

2014 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని తిట్టిపోసిన చంద్రబాబు నాయుడు 2019లో తిరిగి ఆ పార్టీతో జతకట్టడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు. దీనిపై ఏపీ ప్రజలకు టీడీపీ నాయకులు సమాధానం చెప్పాలని పురంధేశ్వరి డిమాండ్ చేశారు.

బీజేపీ వ్యతిరేక కూటమితో ఇబ్బందేం లేదు…

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు ఢిల్లీ వచ్చినా తమకేం అభ్యంతరం లేదని, ఏపీ పాలన గాలికి వదిలేసి ఆయన ఇతర రాష్ట్రాలు పట్టుకుని తిరిగినా ఇబ్బందేం లేదని వ్యాఖ్యానించారు. తమ పార్టీకి వ్యతిరేకంగా ఎవరితో.. ఏ కూటమి ఏర్పాటు చేసినా తమకు కలిగే నష్టమేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఎన్డీయే కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని పురంధేశ్వరి ధీమా వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు ఏపీకి ఎన్ని నిధులు అవసరమైనా ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆమె ఉద్ఘాటించారు. 2019 ఎన్నికల నాటికి ఏపీలో తమ పార్టీ కీలక శక్తిగా మారుతుందని చెప్పారు.

ఊసరవెల్లి, కట్టప్ప.. అసలు పేరు ‘చందా బాబు’: సునీల్ థియోడర్

మరో బీజేపీ నేత సునీల్ థియోడర్ కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. టీడీపీ అధ్యక్షుడి పేరు చంద్రబాబు కాదని, ఆయన పేరు చందా బాబు అంటూ ఎద్దేవా చేశారు. ఈ చందా బాబుది రియల్ ఎస్టేట్ సర్కారు అన్నారు.

2014లో రాహుల్ గాంధీని ఆంధ్రా ద్రోహి అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడెలా ఆయనతో స్నేహం చేస్తున్నారని థియోడర్ ప్రశ్నించారు. అప్పుడు ద్రోహి.. ఇప్పుడు మిత్రుడెలా అయ్యాడో చెప్పాలన్నారు. చంద్రబాబు ఊసరవెల్లిలాంటి వాడని, బాహుబలి సినిమాలో కట్టప్పలాంటి వాడని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణపై మాట్లాడుతూ.. తెలంగాణలో ఫ్యామిలీ రాజ్ సాగుతోందని, దేశంలో ఎక్కడా లేనంత అవినీతి జరుగుతోందని సునీల్ విమర్శించారు.

- Advertisement -