ఏపీలో టీడీపీ ఆశలన్నీ వారిపైనే! మరోసారి 1999 సీన్ రిపీట్ అవుతుందా ?

3:20 pm, Fri, 26 April 19
TDP Latest News, AP Political Latest News, AP Election news, Newsxpressonline

అమరావతి: ఏపీలో ఇప్పుడు ఎన్ని సమస్యలున్నా అందరి దృష్టి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే ఉంది. అయిలే ఫలితాలు వెలువడేందుకు మరికొన్ని వారాలు గడువు ఉండటంతో, రిజల్ట్‌పై ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ముఖ్యంగా ఫలితాల సరళి ఏ రకంగా ఉండొచ్చనే దానిపై ప్రధాన రాజకీయ పార్టీలు చర్చోపచర్చల్లో మునిగిపోయాయి.

తమకు ఈసారి అధికారం ఖాయమంటూ వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుండడంతో.. తమ పరిస్థితి ఏమిటనే దానిపై టీడీపీ క్షేత్రస్థాయి నుంచి నివేదికలు తెప్పించుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఈసారి టీడీపీ గెలుపు ఏపీలోని మహిళా ఓటర్ల మీదే ఆధారపడి ఉందనే చర్చ జరుగుతోంది.

చదవండి: జగన్ గురించి సంచలన నిజం బయటపెట్టిన జేడీ! అయోమయంలో టీడీపీనేతలు!

సీనియర్ నాయకుడు, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పేశారు. ఏపీలో తమ ప్రభుత్వం అందించిన ‘పసుపు కుంకుమ’ పథకం అందుకున్న మహిళలే తమను గట్టెక్కించాలని ఆయన వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉంటే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సహా అందరూ మహిళా ఓటర్లే తమకు మరోసారి అధికారం కట్టబెడతారనే నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది.

పోలింగ్ రోజు అర్థరాత్రి వరకు క్యూ లైన్లలో నిల్చుని ఓటు వేసిన వారిలో సైతం మహిళలే అధికంగా ఉన్నారు. వీరంతా టీడీపీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే అంత రాత్రి వరకు క్యూలో ఉండి ఓటు వేశారని టీడీపీ నేతలు అంచనా వేసుకుంటున్నారు.

అంతేకాకుండా, మహిళా ఓటర్లు టీడీపీకి ఏకపక్షంగా పట్టం కట్టిన దాఖలాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. 1999లో టీడీపీ వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి కారణం మహిళలే అని చెబుతున్నారు.

అప్పట్లో డ్వాక్రా మహిళల కారణంగానే చంద్రబాబు మరోసారి అధికారంలోకి వచ్చారని, ఈసారి కూడా అదే జరుగుతుందని తెలుగు తమ్ముళ్లు మహా ధీమాగా ఉన్నారు. మొత్తానికి ఏపీలోని మహిళా ఓటర్లు మరోసారి చంద్రబాబుకు జై కొడతారా? లేక జగన్‌కు జిందాబాద్ అంటారా? అన్నది తెలియాలంటే ఫలితాలు వెలువడే మే 23 వరకు ఆగాల్సిందే.