తెలుగు రాష్ట్రాలపై హ్యాకర్ల పంజా.. అడిగింది ఇవ్వకుంటే డేటా నాశనం చేస్తామని బెదిరింపులు…

9:36 pm, Fri, 3 May 19

హైదరాబాద్: అటు ఆంధ్రా, ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల విద్యుత్ సరఫరా వెబ్‌సైట్లపై విరుచుకుపడ్డ హ్యాకర్లు సథరన్ పవర్ సైట్లను అధీనంలోకి తీసుకుని అధికారులను బెదిరిస్తున్నారు.

వివరాల్లోకి వెళితే..

తెలంగాణకు చెందిన టీఎస్‌ఎస్పీడీసీఎల్‌, ఎస్పీడీసీఎల్‌ ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన మరో రెండు డిస్కం వెబ్‌సైట్లను ప్రముఖ ఐ‌టి సంస్థ ‘టి‌సి‌ఎస్’ పర్యవేక్షిస్తోంది. అయితే సోమవారం ఈ నాలుగు వెబ్‌సైట్లపై హ్యాకర్లు పంజా విసిరారు. మొత్తం డేటాని దొంగిలించి అడిగినంత నజరానా ఇవ్వకుంటే డేటా పూర్తిగా డిలీట్ చేస్తామని బెదిస్తున్నారు.

ఎప్పటి లాగే విధులు నిర్వహిస్తున్న అధికారులు సోమవారం వెబ్‌సైట్లని చూసి నిర్ఘాంతపోయారు. స్క్రీన్‌పై ”డిపాజిట్‌ సిక్స్‌ బిట్‌ కాయిన్స్‌ అదర్‌వైజ్‌ వి డెస్ట్రాయ్‌ ఆల్‌ యువర్‌ డేటా” అంటూ మెసేజ్ కనపడే సరికి వెంటనే ఐ‌టి విభగానికి తెలియజేశారు. టి‌సి‌ఎస్ సంస్థ సర్వర్లు హ్యాక్ కాకుండా పటిష్టమైన భద్రతలతో ఫైర్‌వాల్స్‌ను ఏర్పాటు చేసింది. ఆ ఫైర్‌వాల్స్‌ని సైతం బద్దలుకొట్టుకుని.., రాన్సమ్‌వేర్‌ అనే వైరస్‌ని పంపి సైట్లలో ఉన్న మొత్తం సమాచారాన్ని చేజిక్కించుకున్నారు హ్యాకర్లు.

ఎన్ని ప్రయత్నాలు చేసినా డేటా వెనక్కి రాకపోవడంతో మంగళవారం రాత్రి సైబర్ క్రైమ్ పోలీసులని ఆశ్రయించారు. దీనితో రంగంలో దిగిన పోలీసులు మింట్ కాంపౌండ్‌లోని ఐ‌టి సర్వర్లను పరిశీలించి అసలు హ్యాకింగ్ ఎలా జరిగింది అనే విషయాలపై కొన్ని ఆధారాలు సేకరించారు. అక్కడ పని చేసే అధికారులు గానీ.. ఉద్యోగులు గానీ ఇంటర్‌నెట్ ద్వారా ఈ పని చేసి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ప్రాధమిక పరిశీలనలో బయట పడిన విషయాలపై సైబర్ క్రైమ్ పోలీసులు అధికారులు, టి‌సి‌ఎస్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. పోగొట్టుకున్న సమాచారాన్ని ఏవిధంగా పొందాలి అనే విషయంపై చర్చిస్తున్నారు. వాబ్‌సైట్లకు మరింత భద్రత ఏర్పాటు చేస్తూ మరిన్ని ఫైర్‌వాల్స్‌లను ఏర్పాటు చెయ్యవలసిందిగా టి‌సి‌ఎస్‌ను ఆదేశించారు.

దీనితో టి‌సి‌ఎస్ సంస్థ బెంగుళూరు, చెన్నై, ముంబై నగరాల నుండి ఐ‌టి నిపుణులని హైదరాబాద్‌కు పిలిపించి పోయిన సమాచారాన్ని తిరిగి పొందేందుకు ప్రయత్నిస్తోంది.. ఈ ప్రక్రియ పూర్తయ్యి డేటా తిరిగి రావాలంటే మరో రోజు పడుతుందని అధికారులు చెబుతున్నారు.