తెలంగాణ ఎన్నికలు చంద్రబాబుకు జీవన్మరణ సమస్య! కేసీఆర్ మళ్లీ వస్తే.. బాబుకు గడ్డుకాలమేనా?

kcr-chandrababu
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి జీవన్మరణ సమస్య. ఈ మాటంటే ఆశ్చర్యం కలగవచ్చుగానీ అది నిజం. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన రాజకీయ భవిష్యత్తు.. ఇప్పుడు తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రజా కూటమి విజయం సాధించడంపై ఆధారపడి ఉంటుంది.

- Advertisement -

ఆ విషయం తెలుసు కాబట్టే కాంగ్రెసుతో సీట్ల పంపకం విషయంలో తెలంగాణలో చంద్రబాబు తన నేతలను త్యాగాలకు సిద్ధం చేశారు. కేవలం 14 సీట్లకు అంగీకరించి, ఆ తర్వాత ఓ సీటును తగ్గించుకున్నారు కూడా. దీన్నిబట్టి చంద్రబాబు ఆలోచన, వ్యూహం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.

బీజేపీతో తెగదెంపులు చేసుకున్న తర్వాత చంద్రబాబు వ్యూహం పూర్తిగా మారిపోయింది. తనకన్నా జూనియర్ అయిన రాహుల్ గాంధీని కలిసి స్నేహహస్తం అందించారు. తెలంగాణలోనే కాకుండా జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెసుతో జత కట్టడానికి సిద్ధపడ్డారు. ఈ నేపథ్యంలో వచ్చే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కూడా కాంగ్రెసుతో చెలిమి ఉంటుందనే అందరూ భావిస్తున్నారు.

మళ్లీ కేసీఆర్ వస్తే.. బాబుకు గడ్డు పరిస్థితే…

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ప్రజా కూటమి విజయం సాధించకుండా, కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తే చంద్రబాబు గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటు ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలపైనా ఈ ప్రభావం పడుతుంది. ఏపీలో టీడీపీ గ్రాఫ్ పడిపోయే ప్రమాదం ఉంటుంది.

అంతేకాదు, బీజీపీని, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రస్తుతం చంద్రబాబు నాయుడు చేస్తున్న సమరం వల్ల భవిష్యత్తులో చంద్రబాబును కేసులు కూడా చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ఒకవేళ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తిరిగి విజయం సాధిస్తే.. ఆ తరువాత జరిగే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చేలోగా కేసీఆర్.. చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని తన వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉంది.

కేసులను తిరగ తోడే ప్రమాదం…

ఓటుకు నోటు కేసు, ఇతర కేసులను కేసీఆర్ తిరగ తోడే ప్రమాదం ఉంది. అలాగనుక జరిగితే అప్పుడు చంద్రబాబు తీవ్రమైన చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. మరోవైపు కేంద్రంలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం గనుక అధికారంలోకి వస్తే.. చంద్రబాబును ఇరకాటంలో పెట్టడానికి అటువైపు నుంచి అది మరిన్ని అస్త్రాలను సంధివచ్చు.

తెలంగాణలో కేసీఆర్ తిరిగి అధికారం చేజిక్కించుకుంటే.. ఆయన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా వేలు పెట్టే అవకాశం ఉంది. వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబును ఓడించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు.  ఒకవేళ వీరిద్దరు విడివిడిగా పోటీ చేస్తే.. కాంగ్రెస్ సాయంతో చంద్రబాబు గట్టెక్కే అవకాశాలు లేకపోలేదు.

అయితే, కేసీఆర్‌ను తక్కువగా అంచనా వేయలేం.  ఆయన చంద్రబాబును కచ్చితంగా ఓడించడానికి అవసరమైన వ్యూహ రచనను అమలు చేసే అవకాశాలు లేకపోలేదు.

జగన్మోహన్ రెడ్డికి, పవన్ కల్యాణ్‌కు మధ్య సయోధ్య కుదిర్చి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వారిద్దరిని పొత్తుకు అంగీకరింపజేసేందుకు కూడా కేసీఆర్ చక్రం తిప్పే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు ఓటమి తప్పకపోవచ్చు. ఈ సమీకరణాల నేపథ్యంలో.. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీని తిరిగి అధికారంలోకి రాకుండా ఓడించడం కాంగ్రెసు పార్టీ కన్నా చంద్రబాబుకే ఎక్కువ అవసరంగా కనిపిస్తోంది.

- Advertisement -