వైసీపీని వీడే యోచనలో ఆ కీలకనేత! అదే జరిగితే వైసీపీకి పరాభవమే!

12:03 pm, Tue, 26 March 19
YCP Latest News, YS Jagan mohan Reddy Latest News, AP Latest Election News, Newsxpressonline

మైలవరం: మైలవరం నియోజకవర్గంలో వైసీపీకి అసమ్మతి సెగ రగులుతూనే ఉంది. ఆ పార్టీ జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కాజ రాజ్‌కుమార్‌ వైసీపీకి గుడ్‌బాయ్‌ చెప్పే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయన పార్టీ వీడితే మైలవరంలో వైసీపీకి పెద్ద షాక్‌ తగిలినట్టే. 2011 నుంచి కాజ రాజ్‌కుమార్‌ వైసీపీలో కొనసాగుతున్నారు.

ప్రస్తుతం యువజన విభాగం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. మైలవరం వైసీపీ అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాదుకు ఆయన దగ్గర బంధువు. వరుసకు సోదరుడు. వసంత మైలవరం రాక ముందు నుంచి వైసీపీ కన్వీనర్లుగా జ్యేష్ఠ రమేష్‌బాబు, జోగి రమేష్‌ బాధ్యతలు నిర్వర్తించిన సమయాల్లో రాజ్‌కుమార్‌ పార్టీలో చాలా చురుకైన పాత్ర పోషించేవాడు.

జోగి వర్గానికి దక్కని స్థానం

పలు సేవా కార్యక్రమాలతో పార్టీ బలోపేతానికి కృషి చేస్తుండేవాడు. రాజ్‌కుమార్‌ ఆరు మాసాలుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. వరుసకు సోదరుడైన కాజకు వసంత వెంకట కృష్ణ ప్రసాదు కనీస మర్యాద కూడా ఇవ్వలేదని, కనీసం సాధారణ కార్యకర్తకు ఇచ్చే గౌరవం కూడా ఇవ్వకపోవడంతోనే కాజ తీవ్ర మనస్తాపంతో ఉన్నాడని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వైసీపీ రెబల్‌ అభ్యర్థిగా కాజ నామినేషన్‌ వేస్తాడని అందరూ భావించారు. కానీ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేయలేదు. ఆయన వైసీపీలో ఉంటారా లేక వేరే పార్టీలో చేరతారా అంశంపై మైలవరంలో చర్చ నడుస్తోంది.గతంలో అప్పసాని సందీప్‌, జోగి రమేష్‌ల ఓటమికి కారణమైన నేతల్నే వసంత పక్కన బెట్టుకొని తిరుగుతున్నాడని, వారికే పెత్తనం అప్పగిస్తున్నారని జోగి వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది