మంచు ఫ్యామిలీ అంటే ‘ముంచే ఫ్యామిలీ’: మోహన్ బాబుపై కుటుంబరావు ఫైర్…

2:50 pm, Sat, 23 March 19
Manchu Family Latest News, Mohan Babu Latest News, AP News, Newsxpressonline

అమరావతి: ఏపీ ప్రభుత్వం తమకు చెల్లించాల్సిన ఫీజ్ రీయింబర్స్ మెంట్ బకాయిలు ఇవ్వడం లేదని శ్రీవిద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత, ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయమై ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు స్పందించారు.

ఈ సందర్భంగా ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, శ్రీ విద్యానికేతన్ లో విద్యార్థుల నుంచి సంవత్సరానికి పదివేల రూపాయల బిల్డింగ్ ఫీజ్ వసూలు చేయట్లేదా? మేనేజ్ మెంట్ సీట్ల కోటా కింద మూడు లక్షల నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ వసూలు చేస్తున్నారా? లేదా? ఇవన్నీ వాస్తవాలు కాదా అని ప్రశ్నించారు.

ఫీజు రీయింబర్స్ మెంట్ పేరిట తమ విద్యాసంస్థలోని విద్యార్థులకు వచ్చే డబ్బులను మోహన్ బాబు తింటున్నారని, ఇరవై ఐదు శాతం మంది విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తున్నామని బయటకు చెప్పుకుంటూ వారి వద్ద ఆ ఫీజులు ఈ ఫీజులంటూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

శ్రీ విద్యానికేతన్ లో పని చేసే లెక్చరర్లు, టీచర్లకు తక్కువ జీతాలు ఇస్తున్నారని ఆరోపించిన కుటుంబరావు, మంచు ఫ్యామిలీ అంటే ముంచే ఫ్యామిలీ లా తయారైందని తీవ్ర విమర్శలు చేశారు. మంచు కరిగిపోయి రాయి మిగిలిందని, వారి బండారం బయటపడటంతో తట్టుకోలేకపోతున్నారని ఆరోపించారు.