షర్మిల ప్రచారంలో రెచ్చిపోయిన దొంగలు.. ఉంగరాన్ని కొట్టేసేందుకు విశ్వప్రయత్నం.. వీడియో వైరల్

10:52 am, Sun, 31 March 19

మంగళగిరి: వైసీపీ చీఫ్ వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల శనివారం మంగళగిరిలో నిర్వహించిన ప్రచారంలో దొంగలు చెలరేగిపోయారు. స్వయంగా ఆమె చేతికి ఉన్న బంగారు ఉంగారాన్నే దొంగిలించేందుకు విశ్వప్రయత్నం చేశారు.

అప్రమత్తమైన షర్మిల వెంటనే తేరుకుని చేతిని విడిపించుకోవడంతో దొంగ ప్రయత్నం సఫలం కాలేదు. కెమెరాకు చిక్కిన ఈ మొత్తం ఘటన సోషల్ మీడియాకెక్కి వైరల్ అవుతోంది.

గుంటూరు జిల్లా మంగళగిరిలో శనివారం షర్మిల బస్సు యాత్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ అభిమానులు, కార్యకర్తలు పోటెత్తారు. జనసంద్రంలా మారిన ఆ ప్రాంతాన్ని చూసిన షర్మిల ఎక్కడలేని ఉత్సాహం కనబరిచారు.

అదే సమయంలో కొందరు కార్యకర్తలు షర్మిలకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఆసక్తి చూపారు. వారి ఉత్సాహాన్ని గమనించిన షర్మిల కూడా వారితో చేతులు కలిపారు.

సరిగ్గా దీనినే తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావించిన ఓ దొంగ అందిరితోపాటు చేయి కలిపాడు. షర్మిల అతడికి చేయి అందించగానే ఆమె వేలికి ఉన్న బంగారు ఉంగరాన్ని లాగేసేందుకు విఫలయత్నం చేశాడు.

వెంటనే అప్రమత్తమైన షర్మిల అతడి నుంచి విడిపించుకుంది. షర్మిలను వీడియో తీస్తున్న కొందరు కార్యకర్తల మొబైళ్లలో ఇది రికార్డు అయింది. వారు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అవుతోంది. దీనిని మీరూ చూడండి.