పవన్ ఆధ్యాత్మిక చింతనకి కారణం ఇదేనా?

7:54 am, Sun, 14 April 19
janasena-chief-pawan-kalyan

అమరావతి: ఏపీలో గత మూడు నెలలుగా ఉన్న ఎన్నికల వేడి, కొంత తగ్గింది. పోలింగ్ ముగియడంతో ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ ఆపలేరు అంటూ ఎన్నికల ప్రచారంలో అనేకసార్లు వ్యాఖ్యలు చేసిన పవన్ పోలింగ్‌ అనంతరం మీడియాతో మాట్లాడాటానికి ఏమాత్రం ఆసక్తి కనపరచకపోవడం హాట్ టాపిక్ గా మారింది. 

పోలింగ్‌ ముగిసిన అనంతరం ప్రముఖ రాజకీయ పార్టీల నేతలు అంతా పోలింగ్ సరళిపై ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలిపై తమ అభిప్రాయాలు వ్యక్త పరిచినా పవన్ మాత్రం ఈ విషయాలపై స్పందించడానికి ఏమాత్రం ఆసక్తి కనపరచకపోవడం వెనక ఆంతర్యం ఏమిటి? అన్న కోణంలో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి.

దీనికితోడు పవన్ కళ్యాణ్ పోటీ చేసిన గాజువాక, భీమవరంలోనూ గెలుపు కష్టం అనే విశ్లేషణలు వస్తున్న నేపధ్యంలో తన వ్యక్తిగత గెలుపు గురించి కూడా ఎటువంటి ప్రకటనా చేయకుండా పవన్ పూర్తిగా ఆధ్యాత్మిక సేవలో కాలం గడపడం హాట్ టాపిక్‌గా మారింది.

గుంటూరు జిల్లాలోని నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయానికి 1.32 కోట్ల విరాళాన్ని అన్నదానం నిమిత్తం ఇవ్వడమే కాకుండా అక్కడ ఆలయంలో చాలాసేపు ఆధ్యాత్మిక సేవలో పవన్ కాలం గడిపాడు. అయితే పవన్ ఈ ఆలయానికి వచ్చాడు అని తెలుసుకుని మీడియా వర్గాలు ఆ ఆలయం వద్దకు వెళ్లి పవన్‌తో మాట్లాడాలని ప్రయత్నించినా పవన్ స్పందించ లేదని తెలుస్తోంది.

సాధారణంగా ఎన్నికల తరువాత రాజకీయ పార్టీల నేతలు తమ కోణంలో ఎన్నికల పోలింగ్‌ను విశ్లేషిస్తారు. దీనికితోడు ఎన్నికల ఫలితాలు రావడానికి ఇంకా 40 రోజుల వరకు వ్యవధి ఉన్న నేపధ్యంలో తమ పార్టీ క్యాడర్‌కు నిరాశ పడకుండా గెలుపు గురించి సంకేతాలు ఇస్తారు.

అయితే దీనికి భిన్నంగా పవన్ శనివారం రోజంతా పూర్తి ఆధ్యాత్మిక సేవలో కాలం గడపడం మీడియాకు మాత్రమే కాకుండా పవన్ అభిమానులకు కూడ అర్ధంకాని విషయంగా మారింది. దీంతో సినిమాలు వదిలి రాజకీయాల బాట పట్టిన పవన్ ఇప్పుడు రాజకీయాలపై విరక్తి చెంది ఆధ్యాత్మిక మార్గంవైపు పయనిస్తున్నారా అని చర్చించుకుంటున్నారు.