వివేకా హత్య కేసు: కీలక నిందితుల అరెస్ట్, పీఎ సహా గంగిరెడ్డి పాత్రపై విచారణ

5:23 pm, Thu, 28 March 19
Viveka Murder Latest News, PA Erra Gangi Reddy News, AP Latest Crime News, Newsxpressonline

కడప: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ప్రధాన అనుచరుడైన ఎర్ర గంగిరెడ్డి, వ్యక్తిగత కార్యదర్శి కృష్ణారెడ్డి, ఇంట్లో పనిచేసే లక్ష్మి కుమారుడు ప్రకాశ్‌ను అరెస్టు చేసినట్టు పులివెందుల పోలీసులు ఓ ప్రకటనలో వెల్లడించారు.

హత్యానంతరం ఆ ముగ్గురు ఏం చేశారంటే..?

హత్యానంతరం సాక్ష్యాలు తారుమారు చేసిన వ్యవహారంలో ఈ ముగ్గురిని అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు. మార్చి 15న ఉదయం స్నానాల గదిలో హత్యకు గురైన వివేకా మృతదేహాన్ని పడక గదికి తరలించినట్టు గుర్తించిన పోలీసులు.. ఆ సమయంలో ఎర్ర గంగిరెడ్డి అక్కడే ఉన్నట్టు భావిస్తున్నారు. ఉదయం లేఖ దొరికినా సాయంత్రం వరకు పోలీసులకు ఎందుకు ఇవ్వలేదనే కారణంతో ఆయన పీఏ కృష్ణారెడ్డిని అరెస్టు చేసినట్టు ప్రకటనలో తెలిపారు.

మార్చి 15న ఉదయం 5.30 గంటలకు తొలిసారి ఇంట్లోకి వెళ్లిన కృష్ణారెడ్డి వివేకా మృతదేహాన్ని చూసినట్టు వెల్లడించిన నేపథ్యంలో అప్పటి నుంచి ఆయన ఇంట్లో ఏం చేశాడనే కోణంలో విచారించారు. స్నానాల గది నుంచి పడక గదికి తరలించడం, రక్తపు మరకలు కడగడం, నుదుటిపై కట్లు కట్టి మృతదేహానికి బట్టలు మార్చడం తదితర వ్యవహారంలో ఎర్ర గంగిరెడ్డి పాత్ర ప్రధానంగా ఉన్నట్టు గుర్తించిన పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.

ఇక, పనిమనిషి లక్ష్మి కుమారుడు ప్రకాశ్‌ రక్తపు మరకలు కడిగాడని తెలిపారు. సుమారు 12 రోజుల పాటు 50మందికి పైగా సాక్షులను పోలీసులు విచారించి మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముగ్గురు నిందితులను పులివెందుల కోర్టుకు తీసుకొచ్చారు. మరోవైపు, ఈ హత్య ఎవరు చేశారనే దానిపై సిట్‌ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే పరమేశ్వర్‌ రెడ్డి, శేఖర్‌ రెడ్డి అనే నిందితులను పోలీసులు తమ అదుపులోనే ఉంచుకొని విచారిస్తున్నారు.

గంగిరెడ్డి పాత్రపై విచారణ..

కాగా, గంగిరెడ్డి పాత్రపై పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు. ఎర్ర గంగిరెడ్డి సొంతూరు కడప జిల్లా తొండూరు మండలం తేలూరు. గత 30 ఏళ్లుగా వివేకానందరెడ్డి, వైఎస్‌ కుటుంబంతో అతనికి సన్నిహిత సంబంధాలున్నాయి. గంగిరెడ్డి అవివాహితుడు. నూనె వ్యాపారంతో జీవితాన్ని ప్రారంభించి గంగిరెడ్డి.. అంచెలంచెలుగా ఎదిగారు.

ఈ క్రమంలో వివేకాతో సన్నిహిత సంబంధాలు ఏర్పడింది. వివేకా హత్య కేసులో సాక్ష్యాల తారుమారు వ్యవహారంలో గంగిరెడ్డినే ప్రధాన అనుమానితుడిగా భావిస్తూ పోలీసులు అరెస్టు చేయడం కీలక పరిణామంగా మారింది.

చదవండి: ‘అయ్యా యాక్టర్ గారూ.. పార్ట్‌నర్ గారూ..’: పవన్‌ కళ్యాణ్‌కు జగన్ సూటి ప్రశ్న