నేడు అమరావతికి జాతీయ మహిళా కమిషన్ నిజనిర్ధారణ కమిటీ

8:58 am, Sun, 12 January 20

అమరావతి: ఏపీ రాజధాని అమరావతిలో ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించిన విషయం జాతీయ మహిళా కమిషన్ దృష్టికి వెళ్లింది. దీంతో నేడు జాతీయ మహిళా కమిషన్(ఎన్‌సీడబ్ల్యూ) నిజనిర్ధారణ కమిటీ అమరావతిలో పర్యటించి.. ఈ ఘటనల్లోని నిజాలు నిగ్గు తేల్చనుంది.

దుర్గ గుడికి వెళ్తున్న తమ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును మహిళా రైతులు కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను కూడా కమిషన్‌కు వారు అందజేయనున్నారు. అలాగే వైసీపీ నేతల వ్యాఖ్యలపైనా ఫిర్యాదు చేయనున్నారు.

మందడం దాడి ఘటనపైనా ఫిర్యాదు…

మందడంలో మహిళల మీద దాడి ఘటనపై కూడా మహిళా రైతులు ఫిర్యాదు చేయనున్నారు. మహిళా రైతులను అరెస్టు చేసిన పోలీసులు అనంతరం వారిని మున్సిపల్ స్టేడియంలో నిర్భందించడం కూడా కలకలం రేపింది.

రాత్రి అవుతున్నా విడిచిపెట్టకపోవడంతో మహిళలు ఆందోళన చెందారు. మహిళా కానిస్టేబుళ్లు లేకుండానే తమను అరెస్ట్‌ చేశారంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో.. మహిళలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై దర్యాప్తుకు సంబంధించి నిజనిర్దారణ కమిటీ నేడు అమరావతిలో పర్యటించనుంది.