విజయవాడ: ఏపీ సీఎం వైఎస్ జగన్తో భేటీ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖుల బృందం మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది.
హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, సి.కల్యాణ్, త్రివిక్రమ్, రాజమౌళి, డి.సురేష్ బాబు, దిల్రాజు, వెంకట్రామి రెడ్డి, దామోదర్ ప్రసాద్ తదితరులు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.
మధ్యాహ్నం సీఎంతో భేటీ…
అక్కడ్నించి వీరంతా గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్కు వెళ్లారు. అక్కడ భోజనం చేసి కొంత సేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంపు కార్యాలయంలో వీరంతా ఆయన్ని కలుస్తారు.
కరోనా లాక్డౌన్ కారణంగా ఆగిపోయిన సినిమా షూటింగ్లకు అనుమతితో పాటు థియేటర్ల ప్రారంభం తదితర అంశాల గురించి కూడా సీఎం జగన్తో వారు చర్చించే అవకాశం ఉంది.
ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగులకు కేసీఆర్ ప్రభుత్వం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆంధ్రలో కూడా జగన్ సానుకూలంగా స్పందిస్తే.. ఇక సినీ, టీవీ రంగాల్లో కొంతకాలంగా నెలకొన్న స్తబ్ధత తొలగిపోతుంది.