విజయసాయి రెడ్డి, లక్ష్మీనారాయణ మధ్య ముదిరిన ట్విట్టర్ వార్!

11:37 am, Sun, 21 April 19
vijayasai-reddy-vv-lakshmi-narayana

అమరావతి: తమ పార్టీ 88 స్థానాల్లో విజయం సాధిస్తుందంటూ జనసేన నేత, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలను వైఎస్సార్సీపీ నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే.

దీంతో వీరిద్దరి నడుమ మాటల యుద్ధం మొదలైంది. శనివారం ఇది మరింత ముదిరింది. జనసేన నేత లక్ష్మీనారాయణ తనదైన శైలిలో విజయసాయి రెడ్డిని ఉద్దేశించి ట్విట్టర్‌లో ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

చదవండి: 65 చోట్ల పోటీ చేస్తే 88 స్థానాలలో గెలుస్తారా?: జనసేన లక్ష్మీనారాయణపై విజయసాయి రెడ్డి…

మూడు నెలల్లో మూడు పార్టీలు మారారంటూ విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు లక్ష్మీనారాయణ రిటార్ట్ ఇచ్చారు. తన రాజకీయ రంగ ప్రవేశంపై తాను ప్రకటించిన వెంటనే అనేక పార్టీలు తమ పార్టీలో చేరమంటూ ఆహ్వానించాయని, ఈ విషయాన్ని తాను పలుమార్లు మీడియాలో చెప్పానని, ఇలా తనను ఆహ్వానించిన పార్టీల్లో వైఎస్సారెస్పీ కూడా ఉందని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.

రెడ్ కార్పెట్ పరిచి మరీ ఆహ్వానిస్తానని చెప్పింది మీరు కాదా? అంటూ ఆయన వైఎస్సార్సీపీ నేత విజయసాయి రెడ్డిని ప్రశ్నించారు. అంతేకాదు, ఈ విషయాన్ని ఎక్కడా బయటపెట్టని మీ తీరు చూస్తుంటే.. ఇక ప్రజల దగ్గర ఇంకెన్ని విషయాలు దాస్తున్నారో అనే అనుమానం కూడా తలెత్తుతోందన్నారు.

చదవండి: మీరు ఎప్పటికి జేడీనే! విజయసాయిరెడ్డి షాకింగ్ కామెంట్స్!

మీ పార్టీ ఆహ్వానాన్ని నేను గౌరవంగా తిరస్కరిస్తే.. ఆ బాధను మీరు ఇలా వ్యక్తపరుస్తున్నారా? అంటూ లక్ష్మీనారాయణ నిలదీశారు.  అలాగే.. జనసేన 65 స్థానాల్లో పోటీ చేసి.. 80 స్థానాల్లో డమ్మీ అభ్యర్థులను నిలిపిందన్న విజయసాయిరెడ్డి వ్యాఖ్యలకు కూడా లక్ష్మీనారాయణ బదులిచ్చారు.

‘‘మీ హైదరాబాద్, ఢిల్లీ ట్యూషన్లు కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ట్యూషన్్ మాస్టార్లు కోప్పడతారు. ఓసారి లెక్కలు సరి చూసుకోండి. ఎగువ సభ ఔన్నత్యాన్ని నిలబెట్టండి. ప్రజలందరూ చూస్తున్నారు. మాది పారదర్శకమైన పార్టీ, మా జనసేన హోదాలతో పని చేసే పార్టీ కాదు, హృదయాలతో పనిచేసే పార్టీ..’’ అంటూ ట్వీట్ చేశారు.