బాండ్ పేపర్ రాసిస్తా.. కోర్టుకు లాగొచ్చు: లక్ష్మీనారాయణ వినూత్న ప్రచారం

2:35 pm, Thu, 28 March 19
JD Lakshmi Narayana Latest News, Janasena Latest News, Pawan Kalyan Latest News, Newsxpressonline

విశాఖపట్నం: సీబీఐ మాజీ జేడీ, విశాఖ పార్లమెంటు నియోజకవర్గం జనసేన అభ్యర్థి వీవీ లక్ష్మీనారాయణ వినూత్న ప్రచారంతో దూసుకుపోతున్నారు. విశాఖకు స్పెషల్ మేనిఫెస్టో అంటూ సంచలన ప్రకటన చేశారు. విశాఖపట్నానికి మేనిఫెస్టోను బాండ్ పేపర్ మీద రాసివ్వబోతున్నానని ఆయన స్పష్టం చేశారు.

కోర్టుకు లాగొచ్చు..

మేనిఫెస్టోలోని హామీలు అమలు చేయకుంటే తనను కోర్టుకు లాగొచ్చని.. ఆ దమ్ము తమ పార్టీకి ఉందని లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. కాగా, జేడీ ప్రకటనను జనసేన పార్టీ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో ‘విశాఖపట్నానికి మేనిఫెస్టో నేను బాండ్ పేపర్ మీద ఇవ్వబోతున్నాను. రేపు నన్ను కోర్టుకు లాగొచ్చు మీరు చెయ్యలేదు అని. ఆ దమ్ము ఉంది మాకు’అన్నారు.

నామినేషన్ వేసిన రోజే 24 గంటలు విశాఖవాసులకు అందుబాటులో ఉంటానని చెప్పిన లక్ష్మీనారాయణ.. అవసరమైతే బాండ్ పేపర్ కూడా రాసిస్తానన్నారు. తాను రాజకీయాలపైనే దృష్టి పెట్టానని.. మాఫియాలు సపోర్ట్‌ చేసే నాయకులు కావాలా?.. సమర్థవంతమైన నాయకులు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలన్నారు.

మిగతా పార్టీలు డబ్బులు ఇచ్చి ముందుకు వస్తే.. జనసేన మాత్రం ఆ గబ్బును వదిలించడానికి ముందుకు వచ్చిందన్నారు. తన ఉద్యోగాన్ని వదలి రాజకీయాల్లోకి అడుగు పెట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరిన విషయం తెలిసిందే. విశాఖపట్నం నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు.

చదవండి:వాసన పోలేదు! సైకిల్ గుర్తుకే మన ఓటంటూ నామా ప్రచారం, కార్యకర్తల కేకలు