వైఎస్ వివేకా హత్య కేసు: మరో నలుగురి అరెస్ట్, రహస్య ప్రాంతంలో విచారణ

- Advertisement -

కడప: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. హత్య కేసులో కీలక ఆధారాల కోసం సిట్ అధికారులు అన్వేషిస్తున్నారు. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు.. మంగళవారం మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

కడపలోని ఓ రహస్య ప్రాంతంలో ఈ అనుమానితులను విచారిస్తున్నట్లు తెలిసింది. వివేకా ముఖ్య అనుచరుడు ఎర్ర గంగిరెడ్డిని నాలుగు రోజుల క్రితమే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో అనుచరుడు పరమేశ్వర్ రెడ్డిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.

పరమేశ్వర్ రెడ్డి అనుచరులేనా…?

ఈ క్రమంలోనే పరమేశ్వర్ రెడ్డి అనుచరులుగా భావిస్తున్న నలుగురు అనుమానితులను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సింహాద్రిపురం మండలం కతనూరుకు చెందిన శేఖర్ రెడ్డి, సునీల్ యాదవ్ తోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కిరాయి హంతకుడైన శేఖర్ రెడ్డిపై ఇప్పటికే హత్య కేసులున్నాయి.

ఇటీవలే బెయిల్‌పై వచ్చిన శేఖర్ రెడ్డిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే 20మంది సాక్షులను విచారించిన పోలీసులు.. మరికొంతమందిని ప్రశ్నించే పనిలో ఉన్నారు. అయితే, వివేకా హత్యకు గల కారణాలు గానీ, హత్య ఎవరు చేశారన్న విషయంపై గానీ ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు వెలుగులోకి రాకపోవడం గమనార్హం.

 

- Advertisement -